రైల్వేజోన్‌ ఏర్పాటు హర్షణీయం

మిగతా స్టేషన్లూ ఈ జోన్‌లో కలపాలి: ఎంపి
శ్రీకాకుళం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ప్రకటించడం పట్ల శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు, ఏపీ ప్రజలు, తెదేపా నేతలు, కార్యకర్తల ఏళ్ల పోరాటం, కృషి ఫలించిందన్నారు. అయితే ఇప్పటితో తమ పోరు ఆగిపోలేదని, జోన్‌లో కలపని మిగిలిన స్టేషన్లను కూడా విశాఖ జోన్‌లో కలపాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏడు స్టేషన్లు ఇంకా కుర్దా డివిజన్‌లోనే ఉన్నాయన్నారు. పలాస, జాడుపూడి, మందస రోడ్డు, సుమ్మాదేవి, ఇచ్ఛాపురం, బారువా, సోంపేట స్టేషన్లను కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో కలపాలని డిమాండ్‌ చేశారు.  మరోవైపు ప్రస్తుతం ఖుర్దా డివిజన్‌లో కొనసాగుతున్న పలాస, ఇచ్ఛాపురం స్టేషన్లు అదే డివిజన్‌లో ఉంటాయని విశాఖ డీఆర్‌ఎం మాధుర్‌ తెలిపారు. ఆ రెండు స్టేషన్లు విశాఖ జోన్‌లో కలపాలన్న ప్రతిపాదనేదీ లేదని తెలిపారు. ప్రధానమంత్రి 3గంటల సభ కోసమే విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన అని  రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ… గుంటూరులో జరిగిన నిరసన సెగకు మోదీ తలొగ్గారన్నారు. మోదీ కేవలం ఎన్నికల అంశంగానే రైల్వే జోన్‌ ప్రకటన చేయించారని ఆయన అన్నారు. విశాఖ పర్యటనలోనూ మోదీకి నిరసన సెగ తప్పదన్నారు. అలాగే యూసీలు అన్ని సక్రమంగా ఇచ్చినా వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ. 700 కోట్లపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. రైల్వే జోన్‌లో లొసుగు లపై వైసీపీ నేతలు నోరు మెదపడం లేదని, విశాఖ రైల్వేజోన్‌లో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని స్టేషన్లు చేర్చాలని రామ్మోహన్‌ నాయుడు అన్నారు.