రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలం
– కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ
సికింద్రాబాద్, సెప్టెంబర్27(జనంసాక్షి) : రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో జరిగిన రైల్వే జీఎం సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్- ఖాజీపేట్ మూడో లైన్‌ను వెంటనే ప్రారంభించాలని కోరానన్నారు. దక్షిణ మధ్య రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పునరుద్దరించాలని, సికింద్రాబాద్ రైల్వే మెడికల్ కాలేజ్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే కాచిగూడ, నాంపల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్ రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని సమావేశంలో కోరినట్లు ఎంపీ దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు చాలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎంటీఎస్ ఫేస్ 2ను యాదాద్రి వరకు పొడగించాల్సి ఉంది.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైల్వేకి నిధులు కేటాయించలేదు, నేను మంత్రిగా ఉన్నప్పుడు 250 కోట్లు ఎంఎంటీఎస్ కు కేటాయింపు చేశామన్నారు. ఇప్పుడు 450 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ ఫేస్ 2కి ఇవ్వాలి, అవి ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు అని దత్తాత్రేయ తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ లపై భారం పడకుండా ఉండేందుకు చర్లపల్లి రైల్ టెర్మినల్ వెంటనే పూర్తి చేయాలి అని దత్తాత్రేయ అన్నారు. లాలపేట రైల్వే ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చాలని, సికింద్రాబాద్ లో రైల్వే మెడికల్ కాలేజీ రావాలి, సికింద్రాబాద్ పరిధిలో రైల్వే ఉద్యోగుల క్వార్టర్స్ ను ఆధునికీకరణ చేయాల్సి ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. రైల్వే స్కూల్స్ లో ఇంగ్లీషు విూడియంతో పాటు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు.