లంకపై ఆంక్షలు విధించాలి

ఈలంను తమిళ దేశంగా ప్రకటించేందుకు
ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి
కేంద్రానికి జయ లేఖ
చెన్నై, మార్చి 27 (జనంసాక్షి) :
తమిళులను ఊచకోత కోస్తున్న శ్రీలంక ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. శ్రీలంక నుంచి తమిళ ఈలంను విడదీయడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేయాలని ఆమె కోరారు. శ్రీలంకను మిత్రదేశంగా పరిగణించడానికి ఇకనైనా కేంద్రం స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతూ జయలలిత మాట్లాడారు. తమిళుల అంశంపై రాష్ట్రంలో విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనలు తమ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. తమిళుల పక్షాన తాము పోరాడుతామని విద్యార్థులు ఆందోళనలు వీడి తరగతులకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంకలో ఘర్షణలు ఉద్రిక్తంగా ఉన్న 2009లో కాల్పుల విరమణ ఒప్పందం అమలయ్యేలా చూడటంలో కేంద్రం, యూపీఏలో భాగస్వామ్య డీఎంకే విఫలమయ్యాయని ఆరోపించారు. లంక తమిళుల విషయంలో డీఎంకే అధినేత కరుణానిధి అనుసరిస్తున్న వైఖరి బూటకపుదని దుయ్యబట్టారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు జయలలిత కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.