లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి,నవంబర్‌13(జ‌నంసాక్షి): స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం నష్టాల బారిన పడిన సూచీలు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. తర్వాత లాభాల బాటపట్టాయి. బ్యాంకులు, ఆటో, లోహ, మౌలిక, చమురు రంగ షేర్లు లాభపడడంతో మార్కెట్లకు కలిసొచ్చింది. చమురు ధరలు పతనానికి అడ్డుకట్ట వేసేందుకు వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు సౌదీ ప్రకటించిన నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 34,846 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ 10,450 పాయింట్ల పైన ట్రేడింగ్‌ ఆరంభించింది. ఆరంభంలోనే కొద్దిసేపు

ఒడిదొడుకులను ఎదుర్కొన్న సూచీలు తర్వాత నిలదొక్కుకుని లాభాలను నమోదు చేశాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 331.5 పాయింట్లు లాభపడి 35144.49 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 100.3 పాయింట్లు లాభపడి 10582.50 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.62 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐషర్‌ మోటార్స్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, అల్టాట్రెక్‌ సిమెంట్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. సన్‌ ఫార్మా, టాటా మోటార్స్‌, ఇండియాబుల్స్‌ హెచ్‌ఎస్‌జీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొ, సిఎ/-లా తదితర కంపెనీల షేర్లు నష్టాలను నమోదు చేశాయి.