లైంగిక వేదింపులపై అంతర్గత సిపిఎం కమిటీ

 

శిశుసంక్షేమశాఖ అభినందన

న్యూఢిల్లీ,నవంబర్‌22(జ‌నంసాక్షి): లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారించేందుకు అంతర్గత కమిటీని సిపిఐ(ఎం) ఏర్పాటు చేసిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం తెలియచేసింది. ఈ విషయంలో అధికారిక ప్రకటనకు ఇప్పటివరకు స్పందించిన ఏకైక రాజకీయపార్టీ సిపిఎం ఒక్కటేనని పేర్కొంది. విూటూ ఉద్యమం నేపథ్యంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిశీలించేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని అక్టోబరు 18న కేంద్ర మంత్రి మనేకా గాంధీ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఆరు జాతీయ పార్టీలకు, 59 ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని తమ పార్టీ వెబ్‌సైట్లలో తెలియచేయాల్సిందిగా ఆమె కోరారు. దీనిపై మనేకా గాంధీకి సిపిఎం కేంద్ర కమిటీ లేఖ రాస్తూ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మూడేళ్ళకోసారి పార్టీ మహాసభ ముగిసిన వెంటనే కమిటీని కూడా పునర్వ్యవస్థీకరిస్తామని పేర్కొంది. ఈ కమిటీలో మరియం ధావలే (ఛైర్‌పర్సన్‌), వి.మురళీధరన్‌ (సభ్యులు), కీర్తి సింగ్‌ (ఎక్స్‌టర్నల్‌ సభ్యులు)గా వున్నారు. అధికార వెబ్‌సైట్‌లో కూడా ఈ సమాచారాన్ని వుంచినట్లు పార్టీ తెలియచేసింది.