లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ
సభను అడ్డుకున్న కేసీఆర్, విజయశాంతి
మీరు సభలో ప్రకటించిన తెలంగాణ ఎప్పుడిస్తారు
నిలదీసిన కేసీఆర్
న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి):పార్లమెంట్‌లో తెలం’గానం’ మార్మోగింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయాలంటూ టీఆర్‌ఎస్ పట్టుబట్టడంతో లోక్‌సభ వాయిదా పడింది. సోమవారం సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎంపీ విజయశాంతి కార్యకలాపాలను అడ్డుకున్నారు. తెలంగాణపై చర్చకు అనుమతివ్వాలని పట్టుబట్టారు. పోడియంలోకి దూసుకెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో స్పీకర్ విూరాకుమార్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కేసీఆర్, విజయశాంతిలను తన చాంబర్‌కు పిలిపించుకొని మాట్లాడారు. తిరిగి ప్రారంభమైన అనంతరం వారు నిరసన కొనసాగించారు. దీంతో తెలంగాణ అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తితే మాట్లాడేందుకు అవకాశమిస్తానని స్పీకర్ కేసీఆర్‌కు హావిూ ఇచ్చారు. అయితే, అందుకు ఆయన
నిరాకరించారు. ఈ నేపత్యంలో ఆయనకు మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో ప్రభుత్వం మోసపూరిత వైఖరి ప్రదర్శిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మూడేళ్ల క్రితం ఇదే సభలో ప్రకటించిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలుపుకోకుండా కేంద్రం వెనక్కుపోయిందని విమర్శించారు. పైగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వడం దోశ వేసినంత సులువు కాదని కాంగ్రెస్ నేతలు అనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ మోసానికి గుండె చెదిరి వెయి మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కేంద్రంలోనూ, అటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు సస్పెండ్ చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వెయ్యి మందికి పైగా బలిదానాలు చేసుకుంటే వయలర్ రవి, ఆజాద్ లాంటి నాయకులు తెలంగాణపై బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెలంటే 30 రోజులు కాదని, తెలంగాణ దోశ వేసినంత ఈజీ కాదనే వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని హెచ్చరించారు. అయితే, ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై మిగతా సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ జోక్యం చేసుకుంటూ.. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. జీరో అవర్‌లో చర్చించాల్సిన అంశంపై ఇప్పుడెందుకు చర్చ అని ప్రశ్నించారు. దీంతో స్పీకర్ కేసీఆర్ మైక్ కట్ చేశారు. మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడాన్ని నిరసిస్తూ.. కేసీఆర్, విజయశాంతి సభ నుంచి వాకౌట్ చేశారు.