వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయం

ఈ విషయం మోడీకి కూడా బాగా తెలుసు

మధ్యప్రదేశ్‌ ప్రచారంలో రాహుల్‌

భోపాల్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోనుందన్న విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా అర్థం అయ్యిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. అందుకే ఆయన భయపడుతున్నారని దీంతో ప్రస్తుతం గుండెనిండా ద్వేషంతో నిండిపోయిందని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ ప్రాంతంలో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వాన్ని గ్దదె దించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతేగాక, కేంద్రంలో కొన్ని నెలల్లో 56 ఇంచుల ఛాతి ఉన్న వ్యక్తి (ప్రధాని మోదీ) ప్రభుత్వం కూడా తొలగిపోతుందని వ్యాఖ్యానించారు. . భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ ఏదో ఒక కుంభకోణంలో భాగస్వామిగా ఉన్నారు. లలిత్‌ మోదీ నుంచి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి కుమారుడు డబ్బు తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కుమారుడి పేరు పనామా పత్రాల్లో వచ్చింది. ఇక్కడ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. వ్యాపం, డంపర్‌, ఈ-టెండెరింగ్‌ వంటి కుంభకోణాల్లో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజాధనాన్ని దోచుకున్నారు. మందసౌర్‌లో రైతుల పట్ల భాజపా ప్రభుత్వ క్రూరంగా వ్యవహరించింది. రైతుల బీమా డబ్బును చెల్లించారు. కానీ, ఆయా బీమా సంస్థలకు మాత్రమే లాభాలు కలిగాయి. రైతులు వాటి వల్ల నష్టపోయారు’ అని విమర్శించారు. పనామా పత్రాల్లో

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కుమారుడి పేరు ఉందని నేను ఇటీవల పొరపాటుగా అన్నాను. దీంతో ఆయన నాపై పరువు నష్టం దావా వేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను వ్యాపం, డంపర్‌, ఈ- టెండెరింగ్‌ కుంభకోణం వంటి వాటిపై కూడా విమర్శలు చేశాను. మరి వాటిని ఖండిస్తూ ఎందుకు పరువునష్టం దావా వేయలేదు? ఎందుకంటే వాటిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రైతులను కూడా దెబ్బతీసింది. గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) తీసుకొచ్చి మరిన్ని సమస్యలు తీసుకొచ్చింది. భాజపా తమ మిత్రులకు రుణ మాఫీలు చేసింది. ఇటువంటివి ఇక భవిష్యత్తులో ఉండవు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అనంతరం 10 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తుంది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని, ప్రతి ఒక్క పౌరుడి బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానని మోదీ హావిూలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు’ అని రాహుల్‌ విమర్శించారు.