వడ్డీరేట్లను తగ్గించని ఆర్‌బీఐ. మార్కెట్లకు నిరాశ

ముంబయి,(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంకు మార్కెట్‌ వర్గాలను నిరాశపర్చింది. సోమవారం ఉదయం ప్రకటించిన మానిటరీ పాలసీలో వడ్డీరేట్లను తగ్గించలేదు. వడ్డీరేట్లతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని కూడా అలాగే ఉంచింది. హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌-డబ్ల్యూపీఐ మే నెలలో 4.7 శాతానికి దిగి వచ్చినా ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు మాత్రం కనికరించలేదు. రూపాయి బాగా బలహీనపడటంతో పెట్రోల్‌తో పాటు ఇతర దిగుమతి వస్తువుల ధరల బాగా పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మున్ముందు ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే ఉద్దేశంతో రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం రెపోరేటు 7.25 శాతంగా ఉంది.నగదు నిల్వల నిష్పత్తి- సీఆర్‌ఆర్‌ ఈ 4 శాతం ఉంది. ధరలు పెరగకపోతే జులై నెల సమీక్ష సమావేశంలో వడ్డీరేట్లు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఆర్‌బీఐ నిర్ణయంతో మార్కెట్లు నష్టపోతున్నాయి. సెన్సెక్స్‌ 80 పాయింట్ల దాకా కోల్పోతూ 19,100 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోతూ 5,775కి సమీపంలో ఉంది.