వరదకు నిండామునిగిన రత్తకన్న గ్రామం
గ్రామంలో పర్యటించి ధైర్యం చెప్పిన సిఎం చద్రబాబు
శ్రీకాకుళం,అక్టోబర్13(జనంసాక్షి): ఒరిస్సాలోని బగలట్టీ డ్యాంలో వరద ఉధృతి కారణంగా నీటిని దిగువ ప్రాంతానికి వదలడం వల్ల బహుదానది వరద ఎక్కువై ఇచ్ఛాపురం వద్ద ఉన్న శివారు వద్ద గండి కొట్టడంతో రత్తకన్న గ్రామం ముంపునకు గురైంది. ముంపుకు గురైన రత్తకన్న గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. గ్రామ ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ… భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హావిూ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ముంపులో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వంశధార నుండి హిరమండలంలో నీటిని నిలువ చేసి అక్కడ నుండి రత్తకన్న గ్రామానికి నీటిని తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు. ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అధికారులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇచ్ఛాపురానికి ఈ రోజు సాయంత్రానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
హరిపురంలో లోకేశ్
ఉద్ధాన యువత శనివారం అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఉదయం మంత్రి లోకేశ్ హరిపురాన్ని సందర్శించారు. అక్కడి ప్రజల, యువకుల ఆగ్రహం చూసి వెనుదిరిగారు. హరిపురం మెయిన్‌రోడ్‌లో ఉద్ధాన ప్రజలు, యువకులు రాస్తారోకో నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం పై నిరసనగా సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. టైర్లు తగులబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముంపుకు గురైన తమ ప్రాంతానికి ఇంతవరకూ ఎలాంటి సాయం అందలేదని, గ్రామ ప్రజలు తాగు నీరు లేక, తిండి లేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఇప్పుడు సందర్శించడానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.