వరల్డ్ సూపర్ సిరీస్ పై దృష్టి

ఇటీవల చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకుని మంచి ఫామ్‌లో కొనసాగుతున్న రియో ఒంలిపిక్స్ రజత పతక విజేత, ‘తెలుగు తేజం’ పివి.సింధు (21) బుధవారం నుంచి ఇక్కడ ప్రారంభమయ్యే సీజన్ ఎండింగ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మరో ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించాలని ఎదురు చూస్తోంది. ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తొలి భారత బాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించినప్పటికీ దుబాయ్‌లో జరిగే వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వ49432713చ్చింది. చైనా ఓపెన్, హాంకాంగ్ ఓపెన్ టోర్నీల్లో తలపడటానికి ముందు సింధు దుబాయ్ డెస్టినేషన్ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో నిలవడమే ఇందుకు కారణం. అయితే అంతకుముందు జరిగిన డెన్మార్క్ ఓపెన్ టోర్నీలో సింధు ఆరంభంలోనే నిష్క్రమించినప్పటికీ గత రెండు క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో ఆమె అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గత నెలలో తొలిసారి చైనా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన మూడవ ఇండియన్‌గా రికార్డులకు ఎక్కిన సింధు ఆ తర్వాత హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుని టైటిల్ పోరులో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు ఇంగ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే చైనా ఓపెన్‌లో టైటిల్ విజేతగా నిలవడం ద్వారా 11 వేల పాయింట్లను తన ఖాతాలో జమ చేసుకున్న సింధు హాంకాంగ్ ఓపెన్‌లో కూడా ఫైనల్‌కు చేరుకోవడంతో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు జపాన్‌కు చెందిన సయాకా సాటో, మినత్సు మితానీ, థాయిలాండ్‌కు చెందిన పోర్న్‌టిప్ లాంటి మేటి క్రీడాకారిణులను వెనక్కి నెట్టి కెరీర్‌లో తొలిసారి వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దుబాయ్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలని భావించిన సింధు ఇటీవల మకావూ ఓపెన్ గ్రాండ్‌ప్రీ గోల్డ్ టోర్నీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకుంది. దీంతో సింధు మకావూ ఓపెన్‌లో మూడోసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ పోటీలో పాల్గొనలేదు.