వరుడిపై ఊరేగింపులో కాల్పులు

భుజంలోకి దిగిన తూటాతోనే తాళి కట్టిన పెళ్లి కొడుకు

రాజధాని ఢిల్లీలో ఘటనపై పోలీసుల దర్యాప్తు

న్యూఢిల్లీ,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాసేపట్లే వివాహం జరగాల్సి ఉండగా వరుడిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటన దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకుంది. అయితే భుజంలో దిగిన తూటాతోనే ఆ పెళ్లికొడుకు వివాహ వేదిక వద్దకు వచ్చి వధువు మెడలో తాళి కట్టడం గమనార్హం. దక్షిణ దిల్లీలోని మదన్‌గిర్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఘటనలో కాల్పుకు సంబధించి విచారణ చేస్తున్నారు. 25ఏళ్ల బాదల్‌ ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వస్తున్న సమయంలో ఊరేగింపులో గుర్తుతెలియని వ్యక్తులు వరుడిపైకి కాల్పులు జరిపారు. దీంతో అతడి కుడి భుజంలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. దీంతో బంధువులు అతడిని వెంటనే సవిూపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.

ఆస్పత్రిలో దాదాపు మూడు గంటల పాటు చికిత్స పొందిన బాదల్‌ తిరిగి వివాహ వేదిక వద్దకు వచ్చి పెళ్లి తంతును పూర్తి చేశాడు. పెళ్లి అయిపోగానే బాదల్‌ తిరిగి ఆస్పత్రిలో చేరాడని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(సౌత్‌) విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. భుజం ఎముకల మధ్యలో బుల్లెట్‌ ఇరుక్కుపోయిందని, ఆపరేషన్‌ చేయాలని వైద్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. వరుడు దిల్లీలోని ఖాన్‌పూర్‌లో తన ఇంటి వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరిన అనంతరం.. మరో 400విూటర్ల దూరంలో మండపం ఉందనగా ఈ ఘటన జరిగింది.ఊరేగింపులో భాగంగా బంధువులంతా రోడ్డుపై నృత్యాలు చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి కాల్పులు జరిపారని, అసలు ఏం జరుగుతుందో తనకు అర్థంకాలేదని బాదల్‌ పోలీసులకు చెప్పాడు. వెంటనే వాహనంలోనుంచి దిగి మా వాళ్లను పిలిచానని, ఈలోపు దుండగులు పారిపోయారని తెలిపాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.