వరుస లాభాలకు బ్రేక్‌

అంతర్జాతీయ ఒత్తిళ్లతో భారీ నష్టాలు
ముంబై,మే29(జ‌నం సాక్షి ): వరుస లాభాలకు అడ్డుకట్టపడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, రూపాయి విలువ పతనమవడంతో దేశీయ మార్కెట్లు నేడు డీలా పడ్డాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో ఆద్యంతం ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా పతనమై 35వేల మార్క్‌ను కోల్పోగా.. నిఫ్టీ కూడా నష్టపోయింది.ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఆ వెంటనే కోలుకుని లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ జోరు ఎంతోసేపు నిలవలేదు. చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటంతో మళ్లీ మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థల షేర్లు పతనమవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో నష్టాల్లోకి జారుకున్న సూచీలు తిరిగి కోలుకోలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 216 పాయింట్లు దిగజారి 34,949 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,633 వద్ద ముగిశాయి. నేటి మార్కెట్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎయిర్‌టెల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్లు లాభపడగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ్గ/నాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.
————–