వర్మ కమిషన్ సిఫార్సులపై ఆర్డినెన్స్
క్రూరనేరాలకు యావజ్జీవ ఖైదు
అత్యాచారానికి 20 ఏళ్లు కారాగారం
అసభ్య ప్రవర్తనకు గరిష్టంగా మూడేళ్ల జైలు
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :మహిళలపై హింస, అత్యాచార నిరోధక ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రమండలి పచ్చాజెండా ఊపింది. అత్యాచార కేసుల్లో గరిష్ట శిక్ష 20 ఏళ్లుగా ఉండాలన్న వర్మ కమిషన్ సిఫార్సులకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. తీవ్రమైన నేరాల్లో మరణశిక్ష లేదా యవజ్జీవ కారాగార శిక్ష విధించాలనే సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్‌లో యాసిడ్ దాడులను చేర్చేందుకు అంగీకారం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నివాసంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో జస్టిస్ వర్మ సిఫార్సులను ఏకగ్రీవంగా ఆమోదించింది. మహిళలు, యువతులకు భరోసా నిచ్చేందుకు కేంద్రం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల రక్షణకోసం పాటు పడతామని మన్మోహన్‌సింగ్ అన్నారు. సమావేశంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోని, హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే సహా కేబినెట్ మంత్రులంతా హాజరయ్యారు.