వాజ్‌పేయ్ అత్యుత్తమ రాజకీయ నేత
ఆయన వల్ల దేశ అణుశక్తి ప్రపంచానికి తెలిసింది
మండలిలో నివాళి అర్పించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్,సెప్టెంబర్ 27(జనంసాక్షి): దేశ ప్రధానుల్లో మాజీ ప్రధాని వాజపేయి విలక్షణమైన నేత అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన గొప్ప వక్త. ప్రతిపక్షంలో ఉన్నా వాజపేయికి గౌరవం తగ్గలేదు.
బతికున్నప్పుడే వాజపేయికి భారతరత్న రావడం అదృష్టం. ఈ అవకాశం అతికొద్ది మందికి మాత్రమే లభిస్తుందన్నారు. శాసనమండలిలో వాజపేయి సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ముక్కుసూటిగా, నిష్కర్షంగా వెళ్లే వ్యక్తి మాజీ ప్రధాని వాజపేయి. వాజపేయి ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని అవుతారని జవహర్ లాల్ నెహ్రు చెప్పారు. నెహ్రు మాటలను వాజపేయి నిజం చేశారు. అంతటి మహానుభావిడికి ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వాజపేయి ఇంటికి వచ్చి భారతరత్న పురస్కారాన్ని అందజేశారు. భారతదేశ చరిత్రలో వాజపేయి చిరస్థాయిగా నిలిచిపోతారు. వాజపేయి ఉపన్యాసాలు మృదుభాషలో ఉంటాయి. వాజపేయి ఉత్తమమైన విలువలు నెలకొల్పారు. దేశానికి ఉత్తమమైనటువంటి పరిపాలన అందించారు. వాజపేయి అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. విజయవంతంగా అణుపరీక్షలు నిర్వహించారు. దేశ ప్రయోజనాల విషయంలో వాజపేయి ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. ఎవరూ గొప్ప పనులు చేసినా వాజపేయి పొగిడేవారు. గొప్ప ఆదర్శ పురుషుడు వాజపేయి. ఇందిరాగాంధీని వాజపేయి అపరకాళీగా అభివర్ణించారు. హైదరాబాద్‌తో వాజపేయికి ప్రత్యేక అనుబంధం ఉంది. జ్ఞాపకాలు, వారి చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు.
భారత దేశ అణుశక్తిని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయి అని కేసీఆర్ అన్నారు. వాజ్‌పేయి విలక్షణమైన నేత, అద్భుతమైన వక్త అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో
సంబంధం లేకుండా మంచిపని చేసే వారిని పొగిడేవారని గుర్తుచేశారు. ఆయన జ్ఞాపకాలు, చర్యలు భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలన్నారు. ‘వాజపేయి స్మారకార్థం.. ఎకరా స్థలంలో స్మారక భవనం, విగ్రహాం కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం, మండలి పక్షాన వాజపేయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను ‘ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
సోమ్‌నాథ్ ఛటర్జీకి నివాళి
లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ మృతిపట్ల శాసనమండలి సంతాపం ప్రకటించింది. సోమనాథ్ ఛటర్జీ మృతిపట్ల సీఎం కేసీఆర్ మండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) పార్టీకి ఛటర్జీ అనేక సేవలందించారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మొట్టమొదటి కమ్యూనిస్టు నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లోక్‌సభకు ఛటర్జీ 10 పర్యాయాలు ఎన్నికయ్యారు. సోమనాథ్ ఛటర్జీతో కలిసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. చట్టసభల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సోమనాథ్ సూచించారని కేసీఆర్ గుర్తు చేశారు. సోమనాథ్ ఛటర్జీ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.