వాట్సాప్‌లో నకిలీ వార్తలకు చెక్‌

బృందాలను ఏర్పాటు చేసిన సంస్థ

ఇటీవలి ఘటనలతో అప్రమత్తం

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నకిలీవార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 20 పరిశోధనా బృందాలను ఎంపిక చేశామని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వెల్లడించింది. వాట్సాప్‌లో నకిలీ వార్తలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయి, వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై ఈ బృందాలు పనిచేస్తాయని వాట్సాప్‌ తెలిపింది. ఇందుకోసం ఒక్కో బృందానికి 50వేల డాలర్ల చొప్పున మొత్తం 10లక్షల డాలర్లు చెల్లిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న నకిలీ వార్తల మూలంగా భారత్‌లో ఇటీవల పెద్ద ఎత్తున మూకదాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విద్వేష సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను ఆదేశించింది. బ్రెజిల్‌, భారత్‌, ఇండోనేషియా, ఇజ్రాయెల్‌, మెక్సికో, నెదర్లాండ్స్‌, నైజీరియా, సింగపూర్‌, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాల నుంచి ఈ బృందాలను ఎంపికచేసింది. ‘వాట్సాప్‌ విజిలెంట్స్‌? భారత్‌లో వాట్సాప్‌ మెసేజ్‌లు.. మూక హింస’ అంశంపై పరిశోధనలు జరిపేందుకు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌(ఎల్‌ఎస్‌ఈ) నుంచి శకుంతల బనాజీ, రామ్‌నాథ్‌ భట్‌, బెంగళూరులోని మారా విూడియాకు చెందిన అన్షు అగర్వాల్‌, నిహాల్‌ పస్నాతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఈ బృందం వాట్సాప్‌ నకిలీ వార్తల వల్ల చోటుచేసుకుంటున్న మూక హింసలకు పరిష్కారం వెతికేందుకు పరిశోధనలు చేస్తుంది. వాట్సాప్‌లో నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని ఈ ఏడాది జులైలో వాట్సాప్‌ కోరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 600 మంది పరిశోధనా బృందాలు తమ ప్రతిపాదనలను పంపాయి. వీటిలో నుంచి 20 మందిని ఎంపిక చేసినట్లు వాట్సాప్‌ తాజాగా వెల్లడించింది.