వాడిగా..వేడిగా.. వర్షాకాల సమావేశాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రధానంగా నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరలు.. రైలు ప్రమాదాలు.. ఇటీవల పూణెలో జరిగిన పేలుళ్లు.. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు.. విద్యుత్‌ వైఫల్యం.. తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రానికి గ్యాస్‌ కేటాయింపు వాటా పెంపుపై టీడీపీ ఎంపీలు గళమెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా వెళ్లడంతో.. ఆయన స్థానంలో లోక్‌సభ నేతగా సుశీల్‌కుమార్‌ షిండే నియమితులైన విషయం విదితమే. ఆయనకు వర్షాకాల సమావేశాలు పరీక్షగా నిలిచే అవకాశం ఉంది. ఆయన గొప్ప పరిపాలనా దక్షుడే అయినప్పటికీ ప్రణబ్‌ అంత కాకపోవడంతో ప్రధానంగా అందరి దృష్టి ఆయనపై నిలిచింది. నెల రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అతిరథులు, మహా మేధావులున్న విపక్షాల దాడిని ఎలా ఎదుర్కోగలరో వేచి చూడాల్సిందే.
చత్తీస్‌గడ్‌లో గిరిజనుల కాల్చివేత, మనేసర్‌లోని మారుతి ప్లాంట్‌లో హింస గురించి వామపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. అసోంలో అల్లర్లు, పూణేలో పేలుళ్లు, గ్రిడ్ల వైఫల్యం, తదితర అంశాలను మిగిలిన విపక్షాలు లేవనెత్తడం ఖాయమని తెలుస్తోంది.ఆహారభద్రత బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు తదితర బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏదిఏమైనా లోక్‌సభలో ప్రణబ్‌ లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరన్నారు. ప్రస్తుత లోక్‌సభ నేత, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అనుభవజ్ఞుడే అయినప్పటికీ ఆయనకు మరికొంత అనుభవం చేకూరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నెల రోజుల పాటు జరగనున్న లోక్‌సభ సమావేశాల్లో పరిపాలనా పరంగా ఆయన మరింత రాటు దేలగలరని అంటున్నారు.
వర్షాకాల సమావేశాల్లో కేంద్రప్రభుత్వం మొత్తం 31 బిల్లులను ప్రవేశపెట్టనున్నది. ఆ బిల్లులలో భూ సేకరణ, మైనింగ్‌ బిల్లు, ఉన్నత విద్య కోసం జాతీయ అక్రిడిటేషన్‌ అథారిటీ, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, మనీ లాండరింగ్‌ నిరోధక బిల్లు, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సవరణ బిల్లు తదితరమైనవి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ ఎదుట ఉన్న లోక్‌పాల్‌ బిల్లు చర్చకు రాకపోవచ్చని సమాచారం.