విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2 ప్రయోగం

శ్రీహరికోట,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2ను ప్రయోగించారు. ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారమే సాయంత్రం 5.08 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్‌ పక్రియ మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ప్రారంభమైంది. షార్‌లోని బ్రహ్మ ప్రకాష్‌ హాలులో మంగళవారం రాకెట్‌ సన్నద్ధత సమావేశం జరిగింది. ఇందులో గజ తుపానుపై చర్చించారు. దీని ప్రభావం శ్రీహరికోట ప్రాంతంలో అంతగా ఉండకపోవచ్చని.. ప్రయోగానికి ఆటంకాలు ఎదురుకావని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే రాకెట్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డీ2 వాహక నౌక కమ్యూనికేషన్‌కు సంబంధించిన జీశాట్‌-29 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లింది.

జీశాట్‌-29 ఉపగ్రహం ప్రత్యేకతలు

జీశాట్‌-29 ఉపగ్రహంలో కేయూ, కేఏ బ్యాండు పేలోడ్‌లు ఉన్నాయి. ప్రధానమంత్రి డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇస్రో జీశాట్‌-29కు రూపకల్పన చేసింది. దీనిద్వారా మరో రెండు నూతన అంతరిక్ష సాంకేతికతలపై అధ్యయనం చేయనున్నారు. జీశాట్‌ సిరీస్‌లో మూడు ఉపగ్రహాలను పంపాల్సి ఉంది. ఇందులో జీశాట్‌-19 ఉపగ్రహాన్ని 2017 జూన్‌లో శ్రీహరికోట నుంచి కక్ష్యలోకి పంపారు. తర్వాత మళ్లీ జీశాట్‌-29 ఉపగ్రహాన్ని బుధవారం నింగిలోకి పంపింది. మరో ఉపగ్రహమైన జీశాట్‌-11 ఉపగ్రహాన్ని డిసెంబరు 4న యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.