విద్యార్థులంతా ఉత్తమ పౌరులుగా ఎదగాలి – బిజెపి సీనియర్ నేత గజ్జల యోగానంద్”

నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులనేది అక్షర సత్యమని, అందుకే విద్యార్థులంతా మంచి విద్యను అభ్యసించి సమాజానికి దిశా నిర్దేశకులుగా మారాలని భాజపా సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధి మయూర్ నగర్ లోని ‘బోగన్ విల్లా ద స్కూల్’ లో శనివారం రాత్రి నిర్వహించిన 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి కాలికట్ ఎన్ఐటి చైర్ పర్సన్ సరస్వతీ పట్నాయక్ తోకలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలతో కలిసి గజ్జల మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులన్నారు. వారంతా గుణాత్మక విద్యను అందుకోగలిగి సామాజిక స్పృహను ఏర్పరచుకుంటే భవిష్యత్ తరాలకు ఉత్తమ పౌరులుగా నిలిచి సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారన్నారు. దేశం యొక్క నిర్మాణం తరగతి నాలుగు గోడల మధ్యనే నిర్మితమవుతుందని ఆనాడే పెద్దలు సూత్రీకరించారని, అలాంటి విలువలతో కూడిన విద్య నేటితరం ప్రతి విద్యార్థికి అందాల్సిన అవసరాన్ని గజ్జల ఎత్తిచూపారు. విద్యతోపాటు సహ పాఠ్య ప్రణాళికలను ఆకలింపు చేసుకొని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని రేపటి తరం సమాజ నిర్మాతలుగా, దేశాన్ని పరిపాలించే నాయకులుగా యువత ఎదగాల్సిన బాధ్యతను యోగానంద్ ఎత్తిచూపారు. బోగన్ విల్లా ద స్కూల్ విద్యార్థులు సమయస్ఫూర్తితో, చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నందుననే విద్యార్థులంతా ఇలా తమ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారని గజ్జల పునరుద్గాటించారు. ఇందులో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. పాఠశాలలో విద్యారంగ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న బోగన్ విల్లా ద స్కూల్ యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని గజ్జల యోగానంద్, ఎన్ఐటి కాలికట్ చైర్ పర్సన్ సరస్వతీ పట్నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్పర్సన్, ప్రముఖ గాయని డాక్టర్ సుస్మిత పురుషోత్తం, పంచానన సతపతి, స్కూల్ ఫౌండర్ పురుషోత్తం, పేరెంట్ అడ్వైజరీ సభ్యులు సత్యమ్మ, అశ్వినీ నాథ్, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.