విద్యార్థులకు అల్పాహార పథకం తో విద్యా వ్యవస్థలో మరో విప్లవానికి నాంది.

సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో అక్టోబర్06 (జనంసాక్షి)

ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం పథకం తో విద్యా వ్యవస్థలో మరో విప్లవం ప్రారంభం అయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.శుక్రవారం
వనపర్తి పట్టణంలోని 18వ వార్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హరిజన వాడలో సి.యం. అల్పాహార పథకాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ
తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయం, ఇతర కూలి పనులకు వెళ్లడంతో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఉపవాసంతో ఉండకుండా తెలంగాణ రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ 6 నుండి సి.యం. అల్పాహార పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వనపర్తి పట్టణంలోని 18వ వార్డు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హరిజన వాడలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, జడ్పి చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ప్రజా వైద్యశాల డా. ఎల్. మురళీధర్, డా. శారద దంపతులు పాఠశాలకు ఒ.ఆర్.ప్లాంట్ (స్వఛ్చమైన త్రాగు నీటి యంత్రాన్ని) వితరణ చేయగా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి నుండి రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం అందించే పథకం ముఖ్య ఉద్దేశ్యం వివరిస్తూ వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. ఇది అక్కడి యువత గమనించి స్పృహ కోల్పోవడానికి గల కారణాలు తెలుసుకుంటే ఆ విద్యార్థులు ఉదయ అల్పాహారం తీసుకోకుండా వచ్చినట్లు తెలుసుకొని గ్రామం తరపున ప్రతిరోజూ పాఠశాలలో ఉచిత అల్పాహారం ప్రారంభించగా తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారనీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అల్పాహారం అందిస్తే బావుంటుందని ఆ రోజు అనుకున్నామనీ, అయితే అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మదిలో ఈ పథకం ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంతో బలోపేతం అయ్యిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద మౌలిక వసతులు కల్పించినందున విద్యార్థుల హాజరు శాతం, విద్యా నాణ్యత పెరిగిందన్నారు. విద్యావ్యవస్థను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసి నాణ్యమైన ఉచిత విద్యా, వైద్య సేవలు అందిస్తే ప్రజలకు ఆర్థిక భారం పూర్తిగా దూరం అవుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్భాటం తప్ప చదువు ఏమి ఉండదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎంతో మేధావులు ఉంటారని కొనియాడారు. రాజకీయాల్లో సైతం ఉన్నత విద్యావంతులు ఉంటే సమాజం బాగుపడుతుందని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని ఒక సమస్య కేవలం భారత దేశంలో ఉంది అది ఏంటిది అని విద్యార్థులను మంత్రి ప్రశ్నించారు. ఎవరు సరైన సమాధానం ఇవ్వకపోవడం తో ఒక క్లు ఇచ్చారు. క్లు ఆధారంగా 8వ తరగతి ఇంగ్లిష్ మీడియా విద్యార్థిని నాజీర కుల వ్యవస్థ అని సమాధానం ఇవ్వడం తో మెచ్చుకొని ఆమెకు 1000 రూపాయల నగదు బహుమతి ప్రదానం చేశారు.
అనంతరం అక్కడే మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ ఈ రోజు వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం పథకం ప్రారంభం అయినట్లు ప్రకటించారు. దసరా సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో అల్పాహారం అందించనున్నట్లు తెలియజేశారు.
పాఠశాలకు ఆర్. ఒ ప్లాంట్ వితరణ చేసినందుకు ప్రజా వైద్యశాల వైద్యులు డా. మురళీధర్, డా. శారద లను మంత్రి, జిల్లా కలెక్టర్ సన్మానించారు.
జడ్పి చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ యస్. తిరుపతి రావు, డి. ఈ. ఓ నరహరి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ లక్ష్మయ్య, 18వ వార్డు కౌన్సిలర్ గంధం సత్యమ్మ, పాటశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.