విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

స్తంభాలు విరిగి రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
ఆకునూరు గ్రామంలో రైతులు, సీపీఐ నాయకుల నిరసన
(జనంసాక్షి) జులై 16 : విద్యుత్ స్తంభాలు విరిగి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండలంలోని ఆకునూరు గ్రామంలో శనివారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. వారికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మద్దతు తెలిపి మాట్లాడుతూ.. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఆకునూరు సబ్ స్టేషన్ పరిధిలో గ్రామ వ్యవసాయ బావులకు సరఫరా చేసే విద్యుత్ స్తంభం విరిగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆ ఫిడర్ పై సుమారు 80 మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారని, బావుల వద్ద పశువులకు, రైతులకు త్రాగడానికి నీరు కూడా లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాగు చేయాలని జూనియర్ లైన్ మెన్, లైన్ మెన్ లకు రైతులు వేడుకుంటే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్తు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన వారిలో రైతులు సూర రాజు, శెట్టె మల్లయ్య, కడారి మల్లయ్య,కడారి రాజయ్య, తోకల రవి,పోలోజు మహేందర్, పోలోజు కృష్ణమూర్తి, పౌడాల హరిక్రిష్ణ, ఎర్ర బాలయ్య, బైకని బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area