విమానాశ్రయంలో దాడి జరిగితే..  రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా?


– జగన్‌పై దాడిని చంద్రబాబుపై నెట్టేందుకు కుట్ర
– సానుభూతి వచ్చేందుకు దాడిచేశానని నిందితుడే చెబుతున్నాడు
– కేంద్రం ఆడిస్తున్నట్లు గవర్నర్‌ ఆడుతున్నాడు
– విలేకరుల సమావేశంలో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
అమరావతి, అక్టోబర్‌26(జ‌నం సాక్షి) :  కేంద్రం ఆదీనంలో ఉండే విమానాశ్రయం లోపల ప్రతిపక్షనేత జగన్‌పై
దాడి జరిగితే, దానిపై కేంద్రాన్ని నిలదీయాల్సిన వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఐఎస్‌ఎఫ్‌ అదుపులో ఉండే విమానాశ్రయంలోకి ఓ వ్యక్తి కత్తితో లోనికి ప్రవేశిస్తే పట్టుకోలేకపోయారా అని ప్రశ్నించారు. విశాఖలో దాడి జరిగితే జగన్‌ హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత చికిత్స తీసుకోవడాన్ని ఏవిధంగా తీసుకోవాలని నిలదీశారు.
జగన్‌ వేల కిలోవిూటర్లు పాదయాత్ర చేస్తే చిన్న ముల్లు కూడా గుచ్చుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.. జగన్‌పై దాడి చేసిన వ్యక్తి గురించి వైకాపా నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్‌లా చంద్రబాబుకు ఎలాంటి ఫ్యాక్షన్‌ చరిత్ర లేదని.. ఇతరులపై దాడులు చేయించాల్సి అవసరం ఆయనకు లేదన్నారు. జగన్‌కు సానుభూతి వచ్చేందుకే దాడి చేసినట్లు నిందితుడు స్వయంగా చెబుతున్నా వైకాపా నేతలు దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ కు అరసెంటీవిూటర్‌ గాయమైతే గవర్నర్‌ విచారణ చేయాలా అని మంత్రి  ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్‌ ను 12ఏళ్లుగా అలానే కొనసాగిస్తోందని, ఒక గవర్నర్‌ 12ఏళ్లుగా ఒకే చోట ఉన్న సందర్భం ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని నిలదీశారు. అలాంటి గవర్నర్‌ తో విచారణ చేయించాలని జగన్‌ బాబాయ్‌ కోరుతున్నాడని మంత్రి విమర్శించారు. ఎయిర్‌ పోర్ట్‌ లో జరిగినదాడి గురించి కేంద్రాన్ని ఒక్క మాట వైసీపీ వ్యతిరేకంగా అడగడం లేదు ఎందుకనిసోమిరెడ్డి నిలదీశాడు. కేవలం కేంద్రం ఆడుతున్న కుట్రలో భాగంగానే గవర్నర్‌, వైకాపా, టీఆర్‌ఎస్‌, జనసేనలు పావులుగా ఉన్నాయని ఆరోపించారు. వారిని అడ్డుపెట్టుకొని చంద్రబాబుపై తప్పుడు ప్రచారం జరిగేలా, రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా కేంద్రం కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఇలాంటి కుట్రలను చంద్రబాబు ఎన్నో చూశాడని, సమర్థవంతంగా తిప్పికొట్టి ప్రజల ముందు నిజాలను ఉంచుతామని అన్నారు.