విరబూసిన ‘పద్మా’లు

` నటి శోభనకు పద్మభూషణ్‌.. మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం
` ఢల్లీిలో ఘనంగా ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం
` హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌షా
న్యూఢల్లీి(జనంసాక్షి): దిల్లీలో ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో నందమూరి బాలకృష్ణ, డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి వంటి తెలుగు ప్రముఖులు సహా మొత్తం 71 మందికి ఏప్రిల్‌ 28న పురస్కారాలు ప్రదానం చేయగా.. తాజాగా మరికొందరికి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీనటి శోభన పద్మభూషణ్‌ అందుకోగా.. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే, ఏపీ నుంచి వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్‌ కేఎల్‌ కృష్ణ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. పద్మభూషణ్‌ అవార్డును కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషీ సహా పలువురు హాజరయ్యారు.