విశాఖలో వన్డే క్రికెట్ ఫీవర్
అప్పుడే అమ్ముడు పోయిన రూ.500 టిక్కెట్లు
భారీగా ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ
విశాఖపట్టణం,అక్టోబర్20(జనంసాక్షి): విశాఖకు క్రికెట్ ఫీవరన్ పట్టుకుంది. ఈనెల 24న నగరంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ మైదానంలో జరగనున్న భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్టేడియంలో వివిధ రకాల పనులు ఊపందుకున్నాయి. టిక్కెట్లను నగరంలో ఏడు చోట్ల గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభించారు. కనీస ధర కలిగిన రూ. 500 టిక్కెట్లు అధికంగా అమ్ముడుపోయాయి. ఈ టిక్కెట్లు అతి స్వల్పంగా పెట్టడంతో వీటికి డిమాండ్ అధికమైంది. మరో వైపు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 1200 నుంచి టిక్కెట్లు ఆయా కేంద్రంలో లభిస్తున్నాయి. ఇప్పటికే పిచ్, ఔట్‌ఫీల్డు పనులు 90 శాతం పూర్తయ్యాయి. ప్రవేశ ద్వారం వద్ద పచ్చదనం పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల్లో కుర్చీలకు నంబరింగ్ పనులు పూర్తి చేశారు. అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ప్రేక్షకులను నియంత్రించడానికి బారికేడ్లు సిద్ధం చేశారు. గేట్ నంబర్లు, స్టాండ్లు వివరాలు తెలియచేసే సైన్‌బోర్డులు తయారయ్యాయి. అలాగే సెక్యూరిటీ జాగ్రత్తలపై నగర పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా పోలీసుశాఖ అధికారులతో చర్చించారు. మ్యాచ్ జరిగే రోజున ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు ప్రణాళికలను ట్రాఫిక్ ఉన్నతాధికారులు సీపీకి వివరించారు. మరో వైపు క్రికెటర్లకు రక్షణ, స్టేడియంలో అభిమానులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. క్రీడాకారులు నెట్‌ప్రాక్టీస్ చేయడానికి వీలుగా బి గ్రౌండ్‌లో ఏర్పా టు చేస్తున్నారు. వర్షం పడినా ఔట్‌ఫీల్డు, పిచ్ పాడవకుండా గ్రౌండ్ సిబ్బంది కవర్లు సిధ్ధంగా ఉంచారు. క్రీడాకారుల సిట్‌రూం, డ్రెస్సింగ్‌రూం, జిమ్ తదితర వాటికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. డేఅండ్‌నైట్ మ్యాచ్ జరగనుండడంతో ముందు జాగ్రత్తగా అత్యవసర వినియోగానికి అవసరమైన అధిక సామర్థ్యం ఉన్న జనరేటర్లు సిద్ధం చేస్తున్నారు. స్టేడియం నలువైపులా ఉన్న ఫ్లడ్ లైట్లను పరిశీలించి, పాడైన వాటి స్థానంలో కొత్తవి అమర్చే ఏర్పాట్లు చేస్తున్నారు.