విస్తరిస్తున్న హింసా కాండ

అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను కనుగొనడంతో అసోం హింసలో మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరింది. ఈ అల్లర్లలో ఇప్పటికే దాదాపు లక్షకు పైగా నిరాశ్రయులయ్యారు. చిరాంగ్‌ జిల్లాలో బిజ్నీలో 5, కోక్రాఝుర్‌లో మరో మూడు మృతదేహాలను గురువారం నాడు కనుగొన్నారు. ఈ ప్రాంతంలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతుంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. సైన్యం పహరా కాస్తున్నప్పటికీ ఈ హింసా కాండ ఈశాన్య ప్రాంతంలోని మరో రెండు జిల్లాలకు పాకింది. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌గోగాయ్‌ గురువారం నాడు ఖోక్రాఝుర్‌ జిల్లాలో పర్యటించి రక్షణ శిబిరాలలో ఉన్న బాధితులను పరామర్శించారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల నుంచి రెండు లక్షల మంది వలసపోయినట్టుగా భావిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 సహాయ శిబిరాలలో 75వేల మంది తలదాచుకున్నారు. అసోం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ శనివారం నాడు అల్లర్ల ప్రాంతాలలో పర్యటించే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రధాని దృష్టికి తీసుకువస్తున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలియజేశారు. ఈ అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉన్నట్టు భావించడంలేదని ఆయన తెలిపారు. కాగా, రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోయిన 30వేల మంది ప్రయాణికులలో రాష్ట్రానికి చెందిన 200 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. ఆందోళన కారులు రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అస్సాం మీదుగా వెళ్లే దాదాపు 40 రైళ్లను రద్దు చేశారు. గుహవటి ఐఐటీలో తమ పిల్లలను చేర్పించేందుకు రాష్ట్రం నుంచి హైదరాబాద్‌, విజయనగరం, నల్లగొండ, అనంతపురం తదితర జిల్లాల నుంచి వెళ్లిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయారు. వీరంతా కనీస వసతులు లేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.