విూరు అర్హత కోల్పోయారు..!

– ఎంపీ సీఎం రమేష్‌కు వాటాప్స్‌ యాజమాన్య షాక్‌
– రమేష్‌ వాట్సాప్‌ ఖాతా బ్యాన్‌
అమరావతి, ఫిబ్రవరి9(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు వాట్సాప్‌ యాజమాన్యం షాకిచ్చింది. తన వాట్సాప్‌ ఖాతా పనిచేయడం లేదని రమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదుకు ఆ సంస్థ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. విూరు వాట్సాప్‌ సేవలు వాడుకునేందుకు అర్హత కోల్పోయారంటూ ఆ సంస్థ చెప్పడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. ఆయన ఖాతాపై అనేక ఫిర్యాదులు రావడంతో పరిశీలించి చివరకు బ్యాన్‌ చేసినట్లు చెప్పింది. అయితే కంప్లైంట్స్‌ ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు అన్న దానిపై మాత్రం యాజమాన్యం స్పష్టత ఇవ్వలేదు. సీఎం రమేశ్‌ వాట్సాప్‌ ఖాతా బ్యాన్‌కు గురైన సంగతి ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కేంద్ర తన ఫోన్‌, వాట్సాప్‌ ఖాతాపై నిఘా పెట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రమేశ్‌ అనుమానిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తోందని ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ నేతలుసైతం ఇలాంటి ఆరోపణలు చేశారు. టీడీపీలో కీలకనేతగా, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్న సీఎం రమేశ్‌ కేంద్రంపై ఎన్నోసార్లు తీవ్ర ఆరోపణలు చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష సైతం చేశారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు ఆయన ఆస్తులపై దాడులు చేయడం కలకలం రేపింది. విభజన హావిూలపై పోరాడుతున్నందునే తమపై కేంద్రంపై కక్ష గట్టిందని రమేశ్‌ ఆరోపించారు. ఇప్పుడు ఆయన వాట్సాప్‌ ఖాతా బ్యాన్‌ కావడం వెనుక కేంద్రం కుట్ర ఉండొచ్చని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
నా వాట్సాప్‌ సేవలను పునరుద్దరించండి – రమేష్‌
తన ఫోన్‌ నంబర్‌ కు వాట్సాప్‌ సేవలను నిలిపివేయడంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ స్పందించారు. తాను నిబంధనల ప్రకారమే వ్యవహరించానని తెలిపారు. పొరపాటున తప్పు జరిగి ఉంటే మరోసారి అలా కాకుండా జాగ్రత్త పడతానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా తన నంబర్‌ కు వాట్సాప్‌ సేవలను పునరుద్ధరించాలని కంపెనీని కోరారు. కార్యకర్తలు, నేతలతో సంప్రదింపులు జరిపేందుకు తనకు వాట్సాప్‌ అవసరమని వ్యాఖ్యానించారు. తమ కంపెనీ నియమనిబంధనలు ఉల్లంఘించడంతో పాటు చాలా ఫిర్యాదులు రావడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ సీఎం రమేశ్‌ కు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రమేశ్‌ పై ఎవరూ ఫిర్యాదు చేశారన్న విషయాన్ని వాట్సాప్‌ సంస్థ గోప్యంగా ఉంచింది.