వీఆర్ఏల పట్ల ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలి
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) జులై 29 : వీఆర్ఏల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అన్నారు. వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సమ్మెకు సీపీఐ మండల సమితిగా మద్దతు తెలిపిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయక పోవడం విచారకరమన్నారు. చాలీచాలని వేతనాలతో వెట్టి చాకిరికి గురవుతున్న వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ జీవో ను విడుదల చేసి అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించి, 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. వారి వెంట సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, ముస్త్యాల శంకరయ్య, ఇప్పకాయల వెంకటేశం నాలుగు మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.
Attachments area