వీల్‌ చైర్‌ పై ప్రచారం చేస్తా దీదీ


మమత కాలికి బలమైన గాయాలు
48గంటల పర్యవేక్షణ అవసరం వైద్యులు
కోల్‌కతా 11 మార్చి (జనంసాక్షి) :  కాలి గాయంతో ఆసుపత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు గురువారం ఉదయం నివేదిక విడుదల చేశారు. ఆమె ఎడమ కాలు చీలమండ, పాదంలో తీవ్రమైన ఎముక గాయాలను గుర్తించినట్లు వెల్లడించారు. దీదీ కుడి భుజం, మెడకు కూడా గాయమైనట్లు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నుంచి సీఎం.. ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారని, ఆమెను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. మరిన్ని వైద్యపరీక్షలు చేయాల్సి ఉందన్నారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న దీదీని బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తోసేసిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో నామి నేషన్‌ వేసిన అనంతరం రేయపారా ప్రాంతంలో ఓ ఆలయాన్ని సందర్శించి తిరిగి కారు ఎక్కుతుండ గా.. కొంతమంది తనను బలవంతంగా తోసి, కారు తలుపు వేసినట్లు మమత పేర్కొన్నారు. నొప్పితో విలవిల్లాడు తున్న సీఎంను వెంటనే కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్‌రే తీయగా.. కాలి మడమలో పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు.
తృణమూల్‌.. భాజపా మాటల యుద్ధం
మరోవైపు సీఎం కాలికి గాయం నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నెలకొంది. దీదీపై కుట్రపూరితంగానే భాజపా దాడి చేసిందని తృణమూల్‌ ఆరోపించగా.. ఆ వ్యాఖ్యలను కాషాయ పార్టీ ఖండించింది. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అదంతా నాటకమని దుయ్యబట్టింది. చిన్న ప్రమాదాన్ని దీదీ పెద్దది చేసి చూపుతున్నారని ఎద్దేవా చేసింది. అయితే భాజపా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ.. భాజపాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ”బెంగాల్‌ ప్రజల పవర్‌ ఏంటో మే 2వ తేదీన తెలుస్తుంది. దాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ భాజపాకు సవాల్‌ విసిరారు.