వెంటనే రాష్ట్రంలో దళితబంధు అమలు చేయాలి


భూస్వాములను రైతుబంధు నుంచి తప్పించాలి
ఓటమితరవాతే సిఎం కెసిఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారు
విూట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  నవంబర్‌ 4 నుంచే దళితబంధు అమలు చేస్తానన్న కేసీఆర్‌ ఇప్పటి దాకా ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. దళితుల ఓట్ల కోసమే ఎన్నికల సమయంలో దళితబంధు పథకం తీసుకొచ్చరన్నారు. దళితులపై కేసీఆర్‌కు ప్రేమ లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో విూట్‌ ది ప్రెస్‌ లో మాట్లాడిన ఆయన.. దళితబంధును వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలన్నారు. చిత్తశుద్ది వుంటే ఆనాడు ప్రకటించిన మేరకు లబ్దిదారులకు పథకం అమలు చేయాలన్నారు. ఇకపోతే భూస్వాములకు రైతు బంధు ఎందుకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ రైతులకు ఇవ్వడంలో అర్థం ఉందని, కానీ భూస్వాములకు కూడా ఇవ్వడం ద్వారా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు.
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇక టీఆర్‌ఎస్‌తో కొట్లాటే.. తెలంగాణలో అధికారం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు. మెజార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇక టీఆర్‌ఎస్‌కు భవిష్యత్‌ లేదని అక్కడి నేతలే అంటున్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ సంగతి అటుంచి.. ముందు రాష్టాన్న్రి కేసీఆర్‌ చక్కదిద్దాలని ఎమ్మెల్యే హితవు పలికారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తానని
కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో గ్రూపులు లేవని… బండి సంజయ్‌తో వైరం లేదని తేల్చిచెప్పారు. ఏడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదన్నారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే ఇప్పుడు దళితబంధు అమలు చేయాలని ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. తను టిఆర్‌ఎస్‌ నుంచి బయటకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ప్రగతి భవన్‌ కట్టుకున్నాక కెసిఆర్‌
అక్కడి నుంచి కదలి రాలేదన్నారు. ప్రజలను ఏనాడు కలుసుకోవాలన్న ఆలోచనలో లేడన్నారు. తను మంత్రిగా ప్రగతిభవన్‌కు వెళ్లినా పోలీసులు రానీయలేదన్నారు. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదన్నారు. ఓటమి తరవాతే కెసిఆర్‌కు ప్రజలు యాదికి వస్తున్నారని, అందుకే ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారని ఈటెల విమర్శించారు.