వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌

– అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా
వాషింగ్టన్‌, మే9(జ‌నం సాక్షి) : 2018లో భారత్‌ 7.4 వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారనుందని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎమ్‌ఎఫ్‌ బుధవారం పునరుద్ఘాటించాయి. 2019 నాటికి వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుతుందని అంచనా వేశాయి.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలాంటి పరిణామాల నుంచి భారత్‌ కోలుకుందని ఐఎమ్‌ఎఫ్‌ ఆసియా, పసిఫిక్‌ రీజినల్‌ ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ వెల్లడించింది. 2017లో వినియోగదారుల ధరల పెరుగుదల 3.6 శాతంగా ఉందని.. 2018, 19 నాటికి అది 5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. భారత్‌ తర్వాత దక్షిణాసియాలో 2018,19 కాలానికి బంగ్లాదేశ్‌ 7 శాతం వృద్ధి రేటుతో రెండోస్థానంలో నిలవనుందని ఐఎమ్‌ఎఫ్‌ వెల్లడించింది. ఇక శ్రీలంక వృద్ధి రేటు 2018లో 4 శాతం, 2019లో 4.5 శాతం.. నేపాల్‌ వృద్ధి రేటు 2018లో 5 శాతం, 2019లో 4 శాతం ఉంటుందని అంచనా వేసింది. కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లలో బలహీనత, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ప్రభావంతో 2017లో భారత వృద్ధి నెమ్మదించిందని నిన్న ఐక్యరాజ్య
సమితి వెల్లడించింది. ఆ ప్రభావాల నుంచి కోలుకుని, ఈ ఏడాది నుంచి వృద్ధిరేటు క్రమక్రమంగా పుంజుకుంటుందని పేర్కొంది.