వేదాలు పఠిస్తే..  పంటలు బాగు పండుతాయి


– 20నిమిషాల పాటు 20రోజులు వేదాలు పఠించాలి
– గోవా ప్రభుత్వం వ్యాఖ్యలు
పనాజీ, నవంబర్‌24(జ‌నంసాక్షి) : వేదమంత్రాలు పఠిస్తే పంట దిగుబడిని పెంచుకోవచ్చు అని గోవా ప్రభుత్వం చెబుతోంది. రైతులు జగత్సంబంధమైన వ్యవసాయాన్ని(కాస్మిక్‌ ఫామింగ్‌) అలవాటు చేసుకోవాలని, 20 రోజుల పాటు పొలంలో వేదమంత్రాలు పఠిస్తే మంచి, నాణ్యమైన దిగుబడి వస్తుందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి ఒకరు సూచనలు చేయడం గమనార్హం. కాస్మింగ్‌ వ్యవసాయం గురించి
తెలుసుకునేందుకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి విజయ్‌ సర్దేశాయ్‌, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ ఫిగైరెడో హరియాణాలోని గురు శివానంద్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. ‘గోవాలో సేంద్రియ, పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని రైతులు అలవాటు చేసుకోవాలని, ఇందుకోసం కాస్మిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించే సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. దీని వల్ల సంప్రదాయ పద్ధతుల్లో పంట దిగుబడిని పెంచుకోవచ్చునని నెల్సన్‌ తెలిపారు. కాస్మిక్‌ వ్యవసాయం ప్రాముఖ్యతను రైతులకు తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం శివయోగ్‌ సంస్థ, బ్రహ్మకుమారిలతో సంప్రదింపులు జరిపామని నెల్సన్‌ చెప్పారు. ఈ వ్యవసాయ పద్ధతిలో భాగంగా రైతు తన పొలంలో రోజుకు కనీసం 20 నిమిషాలు వేదమంత్రాలు జపించాలని, అలా 20రోజుల పాటు చేయాలన్నారు. మంత్రాలు విశ్వంలోని శక్తిని తీసుకుని పొలానికి అందిస్తాయని, తద్వారా విత్తనాలకు శక్తి అంది మంచి దిగుబడి లభిస్తుంది అనే నమ్మకాలు ఉన్నాయని నెల్సన్‌ చెప్పుకొచ్చారు. ఇలా సేంద్రియ వ్యవసాయం వల్ల పంటల్లో రసాయనాలు, పురుగుల మందుల వాడకం తగ్గుతుందని నెల్సన్‌ తెలిపారు.