వేసవి తాగునీటి సమస్యకు కార్యాచరణ

అనంతపురం,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వర్షాబావ పరిస్థితులు నెలకొన్న ఈనేపథ్యంలో జిల్లాలో తాగునీటి
కష్టాలను అధిగమించేందుకు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేశారు.ప్రభుత్వం నుండి సానుకూల స్పందన ఉంది. సర్‌పేస్‌ వాటర్‌తోనే తాగునీటి అవసరాలు తీర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పిఎబిఆర్‌, చిత్రావతి, మిడ్‌పెన్నార్‌ అందుబాటులో వున్న అవసరాలను ఆసరాగా చేసుకుని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆమోదం లభించింది. ఇది ఆచరణలోకి వస్తే అనంతకు తాగునీటి కష్టాలు దూరమవుతాయని భావిస్తున్నారు.  జిల్లాలో ప్రధానంగా సత్యసాయి గ్రావిూణ నీటి సరఫరా, నీలకంఠాపురం సమగ్రనీటి పథకం, పిఎబిఆర్‌, సిపిడబ్ల్యూ స్కీముల ద్వారా తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. సత్యసాయి వాటర్‌ స్కీము నుండి 578 ఆవాసాలకు, నీలకంఠాపురం పథకం నుండి 884 ఆవాసాలకు నీరు అందుతోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న సమస్యల కారణంగా సమగ్ర నీటి పథకాల నుండి అందాల్సి నీరు సగానికి పైగా ఆవాసాలకు అందటం లేదు. మరో వైపు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే నీరు అందుతుండడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కదిరి, పుట్టపర్తి ప్రాంతాలలోని కొన్ని గ్రామలకు సత్యసాయి నీటిని సంపుద్వారా సరఫరా చేస్తున్నాం. పెనుకొండ, రాప్తాడు, శింగనమల ప్రాంతాలలో నీటి సమస్యలను అధిమించేందుకు కృషి చేస్తున్నాం. నీలకంఠాపురం వాటర్‌ స్కీం మరమ్మతులకు ఆమోదం లభించింది.  పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి అయితే మరిన్ని గ్రామాలకు నీరు అందే అవకాశం వుంది. తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలి.  వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకుని వస్తే వెంటనే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అధికారులు తెలిపారు.