వైఎస్ జగన్‌పై హత్యాయత్నం!
– విశాఖ ఏయిర్‌పోర్టు లాంజ్‌లో ఘటన
– టీ ఇచ్చేందుకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్ద వెయిటర్
– జగన్ ఎడమ భుజానికి స్వల్పంగా గాయం
– ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లిన జగన్
– ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైసీపీ శ్రేణులు
– దాడిని ఖండించిన ఏపీ మంత్రి చినరాజప్ప
– నిందితుడి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి
– ఘటనపై గవర్నర్ నర్సింహన్ ఆరా
– వెంటనే తనకు నివేదిక పంపించాలని డీజీపీకి ఆదేశం
విశాఖపట్నం, అక్టోబర్25(జనంసాక్షి) : విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై దాడి జరిగింది. లాంజ్‌లో వేచి ఉన్న జగన్‌పై అక్కడే పనిచేస్తున్న వెయిటర్ కత్తి తీసుకొని దాడి చేయడం కలకలంరేపింది. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమయ్యింది. గురువారం ఉదయం జగన్.. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఫైలట్ కోసం లాంజ్ వెయిట్ చేస్తున్న సమయంలో.. టీ ఇచ్చేందుకు ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్‌లో పనిచేసే వెయిటర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. లాంజ్‌లో జగన్‌ను పలకరించాడు. 160సీట్లు వస్తాయా సార్ అంటూ.. సెల్ఫీ తీసుకొంటానని అడిగాడు. సెల్ఫీ అడగటంతో.. జగన్ దగ్గరకు రమ్మన్నారు. వచ్చీరాగానే వెయిటర్ తన జేబులో నుంచి కత్తి తీసుకొని జగన్ భుజంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. కోడి పందాలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకోగానే.. జగన్ సార్ విూరు గెలవాలి, విూరంటే నాకు అభిమానం అంటూ నిందితుడు పెద్దకేకలు వేశారు. కత్తిగాటుతో ఎడమ చేతి నుంచి రక్తం కారడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది జగన్‌కు ప్రథమచికిత్స నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. జగన్‌పై దాడి జరిగిందని తెలుసుకున్న వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
దాడి ఘటనపై గవర్నర్ ఆరా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్ నరసింహన్ ఆరాతీశారు. ఏపీ డీజీపీకి ఫోన్ చేసిన గవర్నర్ విపక్ష నేతపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై తనకు తక్షణమే నివేదిక పంపాలని డీజీపీని ఆదేశించారు.
దాడికి పాల్పడిన వారిని వదిలేది లేదు – ఏపీ మంత్రి చినరాజప్ప
విశాఖలో ఎయిర్ పోర్ట్‌లో వైఎస్‌ఆర్ పార్టీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ మంత్రి చిన రాజప్ప అన్నారు. ఈ సదంర్భంగా దాడి వివరాలను తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఠాణెళిలంక ప్రాంతానికి చెందిన జనిపెల్ల శ్రీనివాస్ అనే యువకుడు జగన్‌పై దాడి చేశారన్నారు. ఎయిర్ పోర్ట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న అతను విశాఖ ఎయిర్ పోర్ట్‌లో జగన్‌ని చూసి సెల్ఫీ తీసుకుంటా అని వెళ్లారని.. అనంతరం కత్తితో దాడి చేశారన్నారు. నీకు 160 సీట్లు వస్తాయా? అంటూ జగన్‌ని కత్తితో పొడిచాడని, దాడి జరిగిన వెంటనే పోలీసులు నిందితుడ్ని అదుపులోకి
తీసుకున్నారని చినరాజప్ప తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని దాడిని ఖండిస్తున్నామని, అతడు ఎవరు? ఏమిటి? ఏ పార్టీకి చెందిన వాడు ఇలాంటి పూర్తి వివరాల్ని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ అర్ధం చేసుకోవాలని కోరుతున్నానని, భద్రతా వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న వైసీపీ వాదనకు చినరాజప్ప ఖండించారు. జగన్ సెల్ఫీ అనగానే ముందుకొచ్చి ముద్దులంటాడంటూ అతడు జగన్ పొగడటానికి వచ్చాడని, అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రజాప్రతినిధిపై ఉంటుందన్నారు. మాతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు మేం జాగ్రత్తగా ఉంటున్నామని అన్నారు. ఏది ఏమైనా.. ఎయిర్ పోర్ట్‌పై జరిగిన ఈ దాడిని సహించేది లేదని, అతడు ఎంతవాడైనా చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి వివారాలను సేకరిస్తున్నామన్నారు
నిందితుడి జేబులో లెటర్ ఉంది – ఏపీ డీజీపీ ఠాకూర్
జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి మరీ నిందితుడు శ్రీనివాస్ పథకం ఎటాక్ చేశాడని డీజీపి ఆర్‌పీ ఠాకూర్ పక్రటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ జేబులో ఒక లెటర్‌ను (ఎనిమిది పేజీల) కూడా కనుగొన్నామని చెప్పారు. దీన్ని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. ఈ దాడికి సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు. అయితే సీఐఎస్‌ఎఫ్ రిపోర్టు ఆధారంగా ఇప్పటికే కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పబ్లిసిటీ కోసమే చేశాడా, లేక ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారనేది విచారిస్తామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు ఎయిర్‌పోర్టులోకి కత్తితో నిందితుడు ఎలా ప్రవేశించాడనేది విచారిస్తున్నామని తెలిపారు. అలాగే దాడికి గురైన ప్రతిపక్షనేత జగన్‌ను విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించినట్టు చెప్పారు.
జగన్‌పై దాడి ప్రభుత్వ వైఫల్యమే – వైసీపీ నేత రోజా
వైఎస్ జగన్‌పై దాడి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాట్లాడిన రోజా.. జగన్‌పై దాడిని ఖండించారు. జగన్‌కు వస్తున్న జనాదరణ తట్టుకోలేకే హత్యాయత్నం జరిగిందన్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై కుట్రలు చేశారని.. తర్వాత కూడా ఎన్నో ఆటంకాలు కలగించారన్నారు. ఇప్పుడు ఏకంగా బరితెగించి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.
ఎయిర్‌పోర్టులో అడుగడునా భద్రత ఉంటుందని, ఎవరైనా సరే తనిఖీలు చేసి పంపాలి.. కాని దాడి చేసిన వ్యక్తికి కత్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ దాడిని ఎవరు సపోర్ట్ చేశారు. క్యాంటిన్ ఎవరిది.. ఉద్యోగం ఇచ్చింది ఎవరు.. ఈ దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా.. మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలోఆందోళనకు దిగుతామని రోజా హెచ్చిరించారు. దాడి జరిగినా జగన్ చాకచక్యంగా తప్పించుకోగలిగారని.. ఆ కత్తికి విషం పూశారేమోనని అనుమానాలు ఉన్నాయన్నారు. భద్రతా, నిఘా వ్యవస్థ లోపం వల్లే దాడి జరిగిందని రోజా అన్నారు. అడుగడునా భద్రత ఉండే ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి కత్తితో తిరుగుతుంటే.. భద్రతా సిబ్బంది ఏం చేస్తోందని ప్రశ్నించారు. జగన్‌కు ఏదైనా జరిగితే చూస్తే ఊరుకునేది లేదని.. ఈ దాడి వెనుక ఎవరున్నారో ప్రభుత్వం తేల్చాలన్నారు. కుట్ర చేసినవారిని అరెస్ట్ చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.