వైద్యుడి నిర్లక్ష్యం..  90 మందికి హెచ్‌ఐవీ


– వీరిలో 65 మంది పిల్లలు
– పాకిస్థాన్‌లో అమానుష సంఘటన
కరాచీ, మే3(జ‌నంసాక్షి) : వైద్య వృత్తికే కళంకం తెచ్చాడో ఓ వైద్యుడు.. ప్రాణాలు రక్షించాల్సిన ఆ వైద్యుడు.. ప్రాణాలకు తెచ్చాడు.. నిర్లక్ష్యంగా ప్రవర్తించి హెచ్‌ఐవీ ఇంజక్షన్‌ వేయడంతో 90మంది వ్యక్తులు
హెచ్‌ఐవీ బాధితులు మారారు.. వీరిలో 65మంది పిల్లలు ఉన్నారు.. ఈ అమానుష సంఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.  వైద్యాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్యుడు ఇదివరకే హెచ్‌ఐవీ వ్యాధి భారిన పడినట్లు పోలీసులు వెల్లడించారు. లర్కానా నగర సవిూప ప్రాంతాల్లో 18 మంది చిన్నారుల్లో హెచ్‌ఐవీని గుర్తించిన అధికారులు అలర్ట్‌ను ప్రకటించారు. వైద్య పరీక్షలకు ఆదేశించగా పదుల సంఖ్యలో పిల్లలు హెచ్‌ఐవీ భారిన పడ్డట్లుగా గుర్తించారు. 90 మందికి పైగా వ్యక్తుల్లో హెచ్‌ఐవీ పాజిటీవ్‌గా గుర్తించారు. వీరిలో 65 మంది చిన్నారులు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అబ్దుల్‌ రహమాన్‌ తెలిపారు. విచారణ సందర్భంగా ఓ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న వారంతా ఈ వైరస్‌ భారిన పడ్డట్లు అధికారులు గుర్తించారు. సదరు వైద్యుడు కలుషిత సిరంజీలు వాడటం వల్లే వ్యాధి వ్యాప్తికి కారకుడయ్యాడని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు పాకిస్తాన్‌లో తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన కార్మికులు, సెక్స్‌ వర్కర్స్‌, మత్తు పదార్థాలు తీసుకునేవారిలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.