వైద్యుల పదవీవిరమణ పెంపు?

సిఎం చంద్రబాబు పరిశీలన
అమరావతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రస్తుతం రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ వైద్యుల సేవలు చాలా అవసరం అని ప్రబుత్వం గుర్తించింది. ఆరోగ్యశాఖ సుమారు 50 పథకాలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తోంది. వాటి పర్యవేక్షణ బాధ్యత మొత్తం వైద్యులపైనే ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లడానికి పీహెచ్‌సీ వైద్యులు ఎంతో కృషి చేస్తారు. అందుకే ప్రభుత్వానికి రెగ్యులర్‌ వైద్యుల సేవలు, అందులో సీనియర్‌ వైద్యుల సేవలు ఎంతో అవసరం. దీంతో  వైద్యుల రిటైర్‌మెంట్‌ వయసుపై ప్రభుత్వం మరోసారి దృష్టిసారించింది. ఎంబీబీఎస్‌, పీజీ అన్న తేడా లేకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్యుల రిటైర్‌మెంట్‌ వయసును 65 ఏళ్లు చేసింది. ఇప్పటికే పీజీ పూర్తి చేసిన ప్రభుత్వ వైద్యుల రిటైర్‌మెంట్‌ వయసును 2017 జూన్‌లో 63 ఏళ్లు చేసింది. దీంతో ఎంబీబీఎస్‌ వైద్యుల రిటైర్‌మెంట్‌ వయసు కూడా 63 ఏళ్లు చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం పోరాడుతోంది. కానీ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. మరోవైపు ఇటీవల ఏర్పడిన డాక్టర్ల జేఏసీ కూడా ఎంబీబీఎస్‌ వైద్యుల రిటైర్‌మెంట్‌ వయసు 63 ఏళ్లు చేయాలన్న డిమాండ్‌ను ప్రధానాంశంగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన దస్త్రం ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ)నికి చేరింది. ఎంబీబీఎస్‌ వైద్యుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో రిటైర్‌మెంట్‌ వయసు పెంపు ఖాయమని వైద్యుల సంఘం నేతలు భావిస్తున్నారు. ఈ వారంలో దీనిపై ప్రభుత్వం కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ప్రభుత్వ సర్వీసులో చాలా తక్కువ మంది వైద్యులే ఉన్నారు. వీరందరికీ రిటైర్‌మెంట్‌ వయసు పెంచడం వల్ల రోగులకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. మరోవైపు దీనిని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న తర్జనభర్జనలో ఆరోగ్యశాఖ అధికారు లున్నారు. డాక్టర్లు మాత్రం 2017 జూన్‌ నుంచే అమలులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కానీ అప్పటి నుంచి అమలులోకి తీసుకురావడం సాధ్యమేనా అన్న ఆలోచనలో ఆరోగ్యశాఖ ఉన్నతాధి కారులున్నారు. దీనిపై సీఎంవోనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీనియర్‌ వైద్యుల సేవలను  ఉపయోగించు కునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా వారి రిటైర్‌మెంట్‌ వయసును పెంచుకుంటూ వస్తోంది.