వైసీపీలో దగ్గుబాటి దుమారం!

– పార్టీలో చేరనుండటంపై అసంతృప్తిలో పర్చూరు వైసీపీ శ్రేణులు
– ఇన్నాళ్లు పార్టీ అభివృద్ధికి పాటుపడినవారికి అన్యాయం చేయవద్దు
– వైసీపీ అధినేతను కోరిన నియోజకవర్గ నేతలు
ప్రకాశం, జనవరి28(జ‌నంసాక్షి) : మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేశ్‌ వైకాపాలో చేరనుండటంపై ఆ పార్టీ పర్చూరి నియోజకవర్గ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దగ్గుబాటి రాకను నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా పర్చూరు రోటరీ భవన్‌లో వైకాపా నేతలు సమావేశమయ్యారు. పార్టీలో పనిచేస్తున్నవారికి అన్యాయం చేయొద్దని నేతలు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. దగ్గుబాటి కుటుంబానికి టికెట్‌ ఇచ్చే సంప్రదాయం మంచిదికాదని వారంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.
అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని, ఆయన వల్ల నియోజకవర్గంలో వైసీపీకి ఇబ్బందులే తప్ప ఉపయోగం ఉండదని అన్నారు. దగ్గబాటి ఇతర నేతలను బెదిరింపులకు పాల్పడి వారి గొంతును అణగదొక్కే రాజకీయాలు చేస్తాడని, కులాల మధ్య రాజకీయ వైశమ్యాలు సృష్టించి తనకు అనుకూలంగా రాజకీయాలు చేస్తాడని, ఇది పార్టీకి చేటు తెస్తుందని నియోజకవర్గ వైకాపా నేతలు సమావేశంలో పేర్కొన్నారు. మరోవైపు పురందేశ్వరి ఒకవైపు, తండ్రీ కొడుకులు ఒకపార్టీలో ఉండటం వల్ల బీజేపీ, వైకాపాల మధ్య రహస్య ఒప్పందం ఉందని ప్రజల్లో అనుమానాలు వస్తాయని, దీని ద్వారానూ పార్టీకి చెడే జరుగుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్‌కు దగ్గుబాటికి టికెట్‌ ఇవ్వవద్దని తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉంటే  వైకాపా అధ్యక్షుడు జగన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు హితేశ్‌ ఆదివారం కలిశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం వెంకటేశ్వరరావు విూడియాతో మాట్లాడుతూ తామిద్దరం వైకాపాలో చేరనున్నామని, తన సతీమణి పురందేశ్వరి మాత్రం భాజపాలోనే కొనసాగుతారని చెప్పారు. కాగా హితేశ్‌కు పర్చూరి టికెట్‌ ఇస్తారని ప్రచారం సాగుతుండటంతో ఆనియోజకవర్గంలో టికెట్‌ ఆశించే నేతలు, వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.