శబరిమల వివాదం.. రివ్యూ పిటిషన్‌ వేయనున్న దేవస్థానం

తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): శబరిమల వివాదంపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేయనున్నట్లు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు శబరిమలకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని భక్తులు అడ్డుకున్నారు. దీంతో కేరళలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఇద్దరు మహిళలు, ఇవాళ ఓ మహిళా జర్నలిస్టుతో సహా మరో ఇద్దరు మహిళలు సన్నిధానం వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారికి రక్షణగా నిలిచినా.. అయ్యప్ప దర్శనం కాలేదు. అయితే రోజు రోజుకూ ముదురుతున్న వివాదం పట్ల ట్రావన్‌కోర్‌ దేవస్థాన బోర్డు ఓ నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పును రివ్యూ పిటీషన్‌ ద్వారా సవాల్‌ చేయనున్నట్లు బోర్డు ప్రెసిడెంట్‌ పద్మకుమార్‌ తెలిపారు.