శాంతిసౌంరాజన్ పరిస్థితిపై అజయ్ మాకెన్ సీరియస్
ప్రభుత్వం నుండి న్యాయసహాయం అందిస్తామని ప్రకటన
న్యూఢిల్లీ, జూలై 25(జనంసాక్షి): ఆర్థికపరమైన ఇబ్బందులలో చిక్కుకున్న తమిళనాడు అథ్లెట్ శాంతి సౌందరాజన్ పరిస్థితిపై కేంద్ర క్రీడాశాఖా మంత్రి అజయ్ మాకెన్ స్పందించారు. ఆమెకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. శాంతి తాజా పరిస్థితిపై విచారం వ్యక్తం చేసిన మాకెన్ లింగనిర్థారణ వివాదానికి సంబంధించి ఆమెకు న్యాయసహాయం అందిస్తామని తెలిపారు. విషయం తేలేవరకూ ఆమెకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 2006దోహాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న శాంతి ప్రస్తుతం రోజు వారీ కూలీగా జీవితాన్ని సాగిస్తోంది. 200రూపాయలకు ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తోంది. పతకం గెలిచిన తర్వాత లింగనిర్థారణ పరీక్షలో విఫలమవడంతో దానిని వెనక్కి తీసుకున్నారు. అలాగే ఆమె పేరిట ఉన్న రికార్డులను తొలగించారు. అటు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిషేధం విధించడంతో ఏ పోటీలలో పాల్గోనలేక కూలీగా జీవితం కొనసాగిస్తోంది. అయితే దక్షిణాఫ్రికా మిడిల్ డిస్టెన్స్ రన్నర్ క్యాస్టర్ సెమెన్యా కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కోన్నప్పటకీ అక్కడి ప్రభుత్వం, ప్రజలు ఆమె పక్షాన నిలిచారు. కొన్నేళ్ల పోరాటంతో తనపై విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో సౌతాఫ్రికా యావత్తూ విజయవంతమైంది. ఇటువంటి సపోర్ట్ లేకనే శాంతి సౌందరాజన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె కూలీ జీవితంపై పత్రికలు, టీవీలలో కథనాలు రావడంతో కేంద్ర క్రీడాశాఖా మంత్రితో పాటు పలు సంస్థలు స్పందించాయి. ప్రముఖ ప్రభుత్వ కంపెనీ గ్యాస్ అథారిటి ఇండియా లిమిటెడ్ (గెయిల్) వెంటనే లక్ష రూపాయల సహాయం ప్రకటించింది. దీని కోసం గెయిస్ సంస్థ ప్రతినిధి శాంతిని కలిసి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అలాగే భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ కూడా వచ్చే మూడేళ్ల పాటు నెలకు 15వేల చొప్పున సహాయం అందిస్తామని తెలిపింది. అటు ప్రభుత్వం తరపున క్రీడా మంత్రి హామీ ఇవ్వడంతో త్వరలోనే తన మీద వచ్చిన వివాదంపై శాంతిసౌందరాజన్ న్యాయపోరాటానికి సిద్దమవుతోంది.