శాంతి దూతగా ఇక ఉండను
రాజీనామాకు కోఫీ అన్నన్ నిర్ణయం
భద్రతామండలి సహకరించలేదని వెల్లడి
సిరియా దౌత్యానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ , ఆగస్టు 12 (జనంసాక్షి): ఐక్యరాజ్యసమితి శాంతి ధూత డాక్టర్ కోఫీ అన్నన్ రాజీనామా తో సిరియా శాంతి దౌత్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరియాపై సైనిక దాడులు చేయడానికి ప్రయత్నించిన దేశాలు, సిరియాను వెనకేసుకొచ్చే దేశాల మధ్య ఆయన నలిగిపో యారు. తన ప్రయత్నాలకు భద్రతా మండలి మద్దతు లభించలేదని వాపోయిన అన్సన్ జెనీవా లో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఐక్య రాజ్యసమితి, అరబ్‌లీగ్‌లు కలిసి గత ఫిబ్రవరిలో తమ ఉమ్మడి శాంతి ధూతగా అన్నన్‌ను నియ మించుకున్నాయి. రాజీనామా చేసినా ముందుగా ఒప్పుకున్న ప్రకారం ఈ నెల 31వరకు తనకు అప్పగించిన పదవిలో కొనసాగతుతానని అన్నన్ స్పష్టం చేశారు. సిరియా వ్యవహారంలో అన్నన్‌తో ఎవరూ కలిసిరాలేదు. పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఆయనకు కనిపించలేదు. సిరియా అనుకూల, వ్యతిరేక శక్తుల తీరుతో విసిగిపోయిన అన్నన్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆరుసూత్రాల శాంతి ప్రతిపాదనతో ముందుకెళ్ళిన అన్నన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి ఆశించినదానికంటే ఎక్కువ మద్దతే లభించింది. ఫిబ్రవరిలో ఆయన శాంతి దూతగా నియమితులయ్యారు. ఏప్రిల్ నాటికి కాల్పులు విరమణతో హింసాకాండ గణనీయంగా తగ్గింది. అయితే ఆరు నెలలుగా సాగుతున్న ఆయన శాంతి ప్రయత్నాలకు సిరియా ప్రభుత్వం, విపక్షాలు ఏ మాత్రం సహకరించడం లేదు. పైగా ఈ ఆరు నెలల కాలంలో సిరియాలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. చివరకు అది అంతుర్యుద్ధానికి దారితీసింది. కాల్పులు విరమణ పాటించడానికి ముందు సిరియా వర్గాలన్నీ అంగీకరించాయి. ఆ తరువాత ఎవరూ దాన్ని ఖాతరు చేయలేదు. అంతేకాకుండా ఎవరికి వారు ఏవేవో కారణాలు చెబుతూ వచ్చారు. దాడులకు తెగబడడంతో పరిస్థితి చేయిదాటిపోయేదాకా వచ్చింది.
ఈ పరిస్థితులలో కోఫీ అన్నన్ జెనీవాలో తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరియాలో శాంతి స్థాపన కోసం తాను సాగించిన ప్రయత్నాలకు భద్రతామండలి నుంచి మద్దతు లభించలేదని వ్యాఖ్యానించారు. అన్నన్ సిరియా శాంతి దౌత్యం బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచీ అసాద్ ప్రభుత్వంపై చర్యకు అరబ్ లీగ్, పశ్చిమదేశాలు చేసిన తీర్మానాన్ని రష్యా, చైనాలు రెండుసార్లు వీటో చేశాయి. హేమాహేమీలైన ప్రపంచనేతలకు, భద్రతామండలికి, అంతర్జాతీయ సమాజాన్ని మించి తాను శాంతిని కోరుకోలేను కదా అని రాజీనామా ప్రకటన సందర్భంగా డాక్టర్ అన్నన్ వ్యాఖ్యానించారు.
సిరియాలో హింసకు అసాద్ ప్రభుత్వందే పూర్తి బాధ్యత అని అన్నన్ పేర్కొన్నారు. అక్కడి ప్రతిపక్షం, తిరుగుబాటు దారులు కూడా అంతకంతకు ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఆరుసూత్రాల శాంతి కార్యక్రమానికి తూట్లు పొడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పులు విరమణ ప్రాతిపదికగా సిరియన్ల నాయకత్వంలో రాజకీయ ప్రక్రియతో అక్కడ శాంతిని సాధించాలన్న తన ప్రయత్నాలు పూర్తి విఫలమైనట్లు ఆయన చెప్పారు. అన్నన్ రాజీనామాను ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ ఆమోదించారు. అన్నన్ నాయకత్వాన్ని కోల్పోతున్నందుకు విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అన్నన్ ఆరు సూత్రాల శాంతి కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి సైద్ధాంతిక మద్దతు లభించింది. చివరకు సిరియా, దాని మిత్ర దేశాలు కూడా అన్నన్‌ను అక్కున చేర్చుకుని ఆదరించాయి. అయితే ఆచరణలో మాత్రం ఎవరూ ముందుకురాలేదు. ప్రారంభంలో కొంత మెరుగైన పరిస్థితులు కనిపించనప్పటికీ ఆ తరువాత ఎవరూ సహకరించకపోవడంతో అన్నన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అన్నన్ రాజీనామా చేయడంపై రష్యా విచారం వ్యక్తం చేసింది. అన్నన్ ప్రయత్నాలకు రష్యా బలమైన మద్దతుదారునిగా నిలిచిందని సమితిలో రష్యా రాయబారి విటాలీ చర్కిన్ అన్నారు. సిరియా విదేశాంగ శాఖ కూడా అన్నన్ రాజీనామాపై విచారం వ్యక్తం చేసింది. బ్రిటన్ మాత్రం అన్నన్ ప్రయత్నాలు ఫలించలేదంది. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని అసాద్ ప్రభుత్వానిక గట్టిగా బుద్ధిచెప్పే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఏది ఏమైనప్పటికీ అన్నన్ రాజీనామా చేయడం వల్ల సిరియాలో శాంతి నెలకొల్పే చర్యలను పెద్ద విఘాతం ఏర్పడింది.
సిరియాలో హింసాకాండను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితలోని సాధారణ సభలో ఈ నెల 2న ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 133 దేశాలు ఓటేశాయి. సమితిలో మొత్తం 193 సభ్యదేశాలు ఉన్నాయి. చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని, కేవలం ఆదర్శవంతమైన తీర్మానం కనుక 133 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 30 దేశాలు ఓటింగ్‌కు హాజరుకాలేదు.