శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత మెరుగవ్వాలి

సైంటిస్టులకు ప్రధాని సలహా
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) :
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ వెనకబడి ఉందని, ఈ రంగంలో మరింత ప్రభావవంతంగా పని చేయాలని ప్రధాని మన్మో హన్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఒకటి, రెండు ప్రయత్నాలు విఫలమైతే నిర్వేదం చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బుధవారం ఆయన కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్టియ్రల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) 70వ వార్షికోత్సవాలను ప్రారంభించిన అనంతరం శాస్త్రవేత్తలను ఉద్దేశించి, ప్రసంగించారు. సంప్రదాయ శాస్త్రీయ పద్ధతులు, విధానాలు అవలంభించడం వల్ల కొత్తగాఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో విఫలమవుతున్నామన్నారు. ‘శాస్త్రీయ, మానవ వనరులు ఉన్నా.. ప్రపంచానికి సమాన రీతిలో మనం ప్రభావం చూపలేక పోతున్నాం’ అని అన్నారు. భారత అభివృద్ధి ప్రతి దశలో సీఎస్‌ఐఆర్‌ తన వృత్తినైపుణ్యాన్ని చాటుకుందున్నారు. విధాన నిర్ణయాలకు అనుగుణంగా, జాతీయ ప్రాధాన్యాల మేరకు.. గత 70 ఏళ్లుగా సీఎస్‌ఐఆర్‌ అందిస్తున్న సేవలను ప్రధాని కొనియాడారు. స్వాతంత్య్రానంతరం తొలి రోజుల్లో పారిశ్రామిక రంగంలో గణనీయ మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎస్‌ఐఆర్‌ సొంతమన్నారు. తొలి భారత సూపర్‌ కంప్యూటర్‌ రూపకల్పన, అంతరిక్ష ప్రయోగాలకు కావాల్సిన విడిభాగాల తయారీ, శాటిలైట్స్‌ రూపకల్పన, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ప్రోడక్ట్స్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. నిరాంతయరాయంగా కృషి వల్లే కౌన్సిల్‌కు ఎంతో కీర్తి గడించిందన్నారు. అయితే, ఇంతవరకు సాధించిన విజయాలను చూసి మురిసిపోకుండా.. మరింత కృషి చేయాలని సూచించారు. శాస్త్రీయ పరిశోధనల్లో జాతీయ వృద్ధి రేటులో కనీసం 2 శాతమైన ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించడంలో ఒక దేశంగా విఫలమైనట్లేనని అన్నారు. కేవలం పరిశోనలు, అకాడమిక్‌ ఇనిస్టిట్యూషన్స్‌కు మాత్రమే శాస్త్రవేత్తల ప్రతిభ పరిమితం కాకూడదన్నారు. ఏడాది కాలంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సీఎస్‌ఐఆర్‌ స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక, రంగాల నుంచి జాతీయ నాయకత్వాన్ని పెంపొందించాలన్నారు. యువ శాస్త్రవేత్తలు కలలు కనాలి కానీ, నిర్వేదంలో కూరుకుపోకూడదన్నారు. ప్రపంచీకరణ తర్వాత భారత్‌ ఆర్థిక సంస్కరణలు అమలు చేసిందన్నారు. వైద్య పరీక్షల్లో సీఎస్‌ఐఆర్‌ ఎనలేని కీర్తి గడించిందని, వివిధ వ్యాధులకు ప్రపంచ దేశాలు కనిపెట్టలేని నూతన మందులను కనిపెట్టిందన్నారు.