శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

ఘనంగా ముగిసిన సద్యోముక్తి ఉత్సవం వైభవం
శ్రీకాళహస్తి,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని చలువపందిళ్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికితోడు స్వామి దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇదిలావుంటే భక్తుల పాలిట భూకైలాసంగా విరాజిల్లే శ్రీకాళహస్తీశ్వరాలయంలో బ్ర¬్మత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే సువర్ణముఖి నదీ తీరంలో  నిర్వహించిన సద్యోముక్తి ఉత్సవం వైభవంగా జరిగింది. చిన్న బ్ర¬్మత్సవంగా పిలిచే.. త్రిశూలస్నాన మ¬త్సవం ఆద్యంతం శాస్తోక్తంగా నిర్వహించారు. ఏటా మాఘ పూర్ణిమ రోజున సువర్ణముఖి నదికి పుష్కరోత్సవం జరుపుతుంటారు. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని  పంచమూర్తులైన శ్రీవినాయకస్వామి, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, సోమస్కంధమూర్తి, జ్ఞానప్రసూనాంబిక, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ముక్కంటి ఆలయం నుంచి సువర్ణముఖీ నదీ తీరానికి తీసుకువచ్చారు.  వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య సంకల్ప పూజలు ప్రారంభించారు. యాగకలశాన్ని ఏర్పాటు చేసి త్రిశూలంలో కొలువుదీరిన ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిపారు. ఇక్కడి క్షేత్రంలో నిర్వహించే సద్యోముక్తి వ్రత వైశిష్ట్యాన్ని ఆలయ వేదపండితులు  భక్తులకు వివరించారు. పుష్కర సమయంలో ఉమాదేవి సమేత చంద్రశేఖరస్వామి కొలువుదీరిన త్రిశూలాన్ని ఆలయ అర్చకులు నదీజలాల వద్దకు తీసుకువచ్చారు. ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ అంటూ.. భక్తుల శివనామస్మరణల మధ్య త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధూప, దీప, నివేదనాది కైంకర్యాలు చేపట్టారు.