శీతాకాలం కాబట్టే పెట్రోల్ ధరలు పెరిగాయి
– పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయ్. కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వినియోగదారులు వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. ధరల తగ్గింపు విషయంలో ప్రభుత్వాలు ఏమైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మన నేతాగణం నుంచి పొంతన లేని సమాధానం వస్తుండడం నిరాశ కలిగిస్తోంది. తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం అలాంటి సమాధానమే ఇచ్చారు.శీతాకాలం పోతే పెట్రోల్ ధరలు దిగివస్తాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ”అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ వ్యవహారం. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ సీజన్ పూర్తయితే ధరలు తగ్గుతాయి” అని మంత్రి వివరించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరోవైపు పెరిగిన ధరలపై విపక్షాలు భగ్గుముంటున్నాయి.