శ్రీలంక పేలుళ్లలో నలుగురు జెడిఎస్‌ నేతల మృతి

వివరాలు ట్వీట్‌ చేసిన సిఎం కుమార స్వామి
బెంగళూరు,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీకి చెందిన నలుగురు నేతలు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి వెల్లడించారు. నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భాంతి వ్యక్తంచేశారు. జేడీఎస్‌ నేతల్లో లక్ష్మణ గౌడ రమేశ్‌, కేఏం లక్ష్మీనారాయణ్‌, ఎం. రంగప్ప, కేజీ హనుమంతరాయప్ప మృతి చెందగా.. మరో ముగ్గురు హెచ్‌. శివు కుమార్‌, ఎ. మారెగౌడ, హెచ్‌ పుట్టరాజు ఆచూకీ ఇంకా తెలియ రాలేదని కుమార స్వామి తెలిపారు.  పార్టీ ప్రధాన కార్యదర్శి ఎప్పటికప్పుడు శ్రీలంక పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. న్యూదిల్లీలోని కర్ణాటక భవన్‌ నుంచి ఆయనకు సమాచారం అందుతోంది. బాధితుల కుంటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. వారి కుటుంబాలు ఈ బాధ నుంచి తర్వగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని కుమార స్వామి ట్వీట్‌ చేశారు. జేడీఎస్‌కు చెందిన ఏడుగురు నేతలు ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంక వెళ్లారు. కొలొంబోలోని ద షాంగ్రిలా ¬టల్‌లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. అదే చోట బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేతల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన సంఖ్య 290కి చేరింది. 500మందికి పైగా గాయపడ్డారు.