షీటీమ్స్‌కు ధీటుగా మహిళా కమిటీలు
సత్ఫలితాలు ఇస్తున్న విక్షణ కార్యక్రమం
వరంగల్,జూలై30(జనం సాక్షి): సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు, ఆకాతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వరంగల్ పోలీసులు నడుం బిగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడవారికి ఆత్మరక్షణ కరువైందని గ్రహించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ద్వారా స్వశక్తి కార్యక్రమాన్ని తలపెట్టి ఆడవారు తమ ఆత్మరక్షణను ఎలా కాపాడుకోవాలో నేర్పుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాని కోసం వరంగల్ కవిూషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి మెళకువులు నేర్పించారు. ఆ ప్రయత్నం ఫలిలాలను ఇస్తోంది. చారిత్రక నేపధ్యం కలిగిన ఓరుగల్లులో ఒక్కొక్కరిని ఒక్కో రుద్రమదేవిగా తయారు చేయడమే లక్ష్యంగా స్వశక్తి కార్యక్రమాన్ని పెట్టి నూతన ఒరవడి సత్ఫళితాలు ఇస్తోందని భావిస్తున్నారు. ఆడవారికి మరింత ఆత్మస్ధైర్యం నింపేలా వారి ఆత్మరక్షణ వారి చేతిలోనే ఉందని నిరూపించే విధంగా స్వశక్తి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టి స్థయిర్యం నింపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళా పోలీసులతో కలిసి ఒక స్వశక్తి టీంను ఏర్పాటు చేశారు. వారికి మార్షల్ ఆర్ట్స్, ఆడవారిపై ఆకతాయిలు వెంటపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఎదిరించే సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్, 12 రకాల ఆత్మరక్షణ టెక్నిక్స్‌ను పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించారు. ఆడపిల్లల ఆత్మరక్షణకు, వారికి ఎలాంటి విషయంలోను వేదింపులు ఉండొద్దు అనే భావనతో విద్యార్థినిలకు స్వశక్తి ద్వారా మెళకువలు నేర్పించారు. విద్యార్థినిలకు ప్రత్యేకంగా స్వశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వశక్తి షీ టీం ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఆకతాయిలు ఎదురైనపుడు ఎలా దాడి చేయాలో, దాడి చేసిన వారిని ఎలా ఎదుర్కోవాలో చేసి చూపించారు. భవిష్యత్తు సవ్యంగా ఉండాలని కోరుకోవడమే కాకుండా ఎలాంటి ఆపద ఉన్న పోలీసులం మేమున్నామని చెపుతూ మాలో ఆత్మస్దైర్యాన్ని నింపడానికి ఇచ్చిన శిక్షణ మంచి ఫలితాలు ఇస్తోంది. ఇది ఇతర మహిళలకు స్ఫూర్తిగా మారింది.