సంపూర్ణ వాయు కాలుష్య నివారణకు రూ. 696 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు


పర్యావరణహిత మైనింగ్కు పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి రూ.696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ) అనే అనుబంధ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వారి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టు ఇదే!! ఈ పర్యావరణహిత ప్రాజెక్టు పనుల ప్రగతిని సంస్థ ఛైర్మన్ అండ్ ఎం.డి  ఎన్.శ్రీధర్ గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్ (ఈ అండ్ ఎం)  డి.సత్యనారాయణ రావు, థర్మల్ ప్లాంట్  అధికారులు మరియు నిర్మాణ ఏజెన్సీలతో సుదీర్ఘంగా సమీక్షించారు. నిర్మాణపు పనులు మరింత వేగవంతం చేయాలని, గడువు కన్నా ముందే పనులు పూర్తి చేసి ప్లాంట్ను ప్రారంభించాలని నిర్మాణ ఏజెన్సీలను కోరారు.
ఎఫ్జీడీ ప్లాంట్ ఆవశ్యకత సాధారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతను వినియోగించి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి, దానితో టర్బైన్లను తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ప్రాథమిక పర్యావరణహిత చర్యగా బొగ్గును మండించడం ద్వారా వెలువడే బూడిద మరియు విష వాయువులను శుద్ధిపరిచే ప్రక్రియను చేపడతారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే వాయువులో ఉండే బూడిదను తొలగించడానికి ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అనే అనుబంధ విభాగాన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా బొగ్గును మండించగా వెలువడే వాయువులోనే ఉండే బూడిదను దాదాపు 100శాతం గాలిలో కలవకుండా చూస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రెసిపిటేటర్ విభాగంలో సమకూరిన బూడిదను ఫ్లై యాష్ అంటారు. ఈ ఫ్లై యాష్ను కూడా సిమెంటు, ఇటుకల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ విధంగా ప్రతి ఏడాది విడుదలయ్యే ఫ్లై యాష్ను నూటికి నూరు శాతం సిమెంటు తదితర పరిశ్రమలకు సరఫరా చేస్తూ జాతీయస్థాయిలో ‘‘బెస్ట్ ఫ్లై యాష్ యుటిలైజేషన్ అవార్డు’’లను రెండుసార్లు అందుకుంది. అలాగే పర్యవరణశాఖ వారు ఇచ్చిన నిబంధనల పరిమితుల మేరకు శుద్ధిచేసిన వాయువును థర్మల్ ప్లాంట్ చిమ్నీ ద్వారా  విడుదల చేస్తున్నారు. కాగా పాత నిబంధనలను అనుసరించి బయటకు పంపే వాయువును మరింత శుద్ధి చేయాలని, ఇప్పటివరకు అనుమతిస్తున్న ప్రమాణాలను మరింతగా కుదిస్తూ 2015లో కేంద్ర పర్యావరణ అటవీశాఖ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు గాలిలోకి విడుదల చేయడానికి అనుమతించబడిన సల్ఫర్ ఆక్సైడుల శాతం ఘనపు మీటర్కు 2000 మిల్లీ గ్రాములు ఉండగా దీనిని 200 మిల్లీ గ్రాములకు కుదిస్తూ కొత్త నిబంధనను విధించారు. ఈ నిబంధనకు అనుగుణంగా దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల వారు తమ తమప్లాంట్లకు అనుబంధంగా ఎఫ్జీడీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో తొలిగా స్పందించిన సింగరేణి దీనిపై సింగరేణి సంస్థ తక్షణమే స్పందిస్తూ రూ.696 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని హైదరాబాద్కు చెందిన పి.ఈ.ఎస్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టెండర్ ప్రక్రియ ద్వారా చేపట్టి ఇప్పటికే 20% పనులను పూర్తి చేసింది . పర్యావరణ చర్యలకు పెద్దపీట వేస్తున్న ఛైర్మన్ మరియు ఎండి ఎన్. శ్రీధర్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ దీనిని మరింత వేగవంతంగా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. నిర్మాణ ఏజెన్సీలకు పూర్తి సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో యూనిట్ ఒకటికి సంబంధించిన ఎఫ్జీడీని 2024 జూన్ కల్లా పూర్తి చేయాలని, రెండవ యూనిట్కు సంబంధించిన నిర్మాణాన్ని అదే ఏడాది సెప్టెంబర్లోపు పూర్తి చేయాలని ఆయన కాలపరిమితిని నిర్దేశించారు.
ఎఫ్జీడీతో వాయు శుద్ధి ప్రక్రియ ఇలా ఉంటుంది ఫ్లూ గ్యాస్ డీసల్పరైజేషన్గా పిలవబడి ఈ ప్రాజెక్టులో బొగ్గు మండించగా వచ్చే వాయువులో దాగి ఉన్న సల్ఫర్ అనుబంధ వాయువులను వేరు పరుస్తారు. దీనికోసం 150 మీటర్ల ఎత్తయిన ఒక చిమ్నీనీ ఏర్పాటు చేస్తారు. ఈ చిమ్నీలో కింది నుండి పైకి వచ్చే వాయువుపై  కాల్షియం కార్బోనేట్ (తడి సున్నం)ను పైనుండి బలంగా పంపిస్తారు. తద్వారా బొగ్గు మండించిన వాయువుల్లో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్తో పలుదశల్లో తడి సున్నంతో రసాయనిక చర్య జరుగుతుంది