సబ్సిడీ సొమ్ము కాజేస్తే జైలుకే

యూనిట్లు స్థాపించి స్వయం సమృద్ది సాధించాలి

ఏలూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): యూనిట్ల స్థాపనలో సబ్సిడీని స్వాహా చేయకుండా వాటితో ఆదాయాన్ని పొందాలని జిల్లా అధికారులు సూచించారు. సబ్సిడీసొమ్ము స్వాహాచేస్తే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం రికవరీ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో కాపు కార్పొరేషన్‌ పరిధిలో 17 వేలు, బిసి కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 10 వేలు, ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా ఆరు వేలు, మైనార్టీ, గిరిజన కార్పొరేషన్ల పరిధిలో రెండు వేల మందికి మొత్తం 35 వేల మంది పేదలకు సబ్సిడీతో కూడిన యూనిట్లను మంజూరు చేస్తామని వాటిని ఖచ్చితంగా స్థాపించి తీరాలని ఆదేశించారు.రూ.200 కోట్లకు పైగా సబ్సిడీ రుణాలను అందిస్తున్నామని అన్నారు. అయితే యూనిట్‌ స్థాపించకుండా సబ్సిడీ సొమ్ము స్వాహా చేస్తే జైలు శిక్ష

తప్పదని హెచ్చరించారు. రుణాల పేరుతో పంచుకుతినేద్దామనే ఆలోచనకు కాలం చెల్లిందని మంజూరైన ప్రతి యూనిట్‌ను స్థాపించి తీరాలని ఇలా అయితే రాబోయే ఆరేళ్లలో జిల్లాలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించ గలుగుతామని అన్నారు. అంతే తప్ప సబ్సిడీలోన్లు పొందడం అందరూ కలిసి పంచుకుతినడం వంటి కార్యకలాపాల వల్ల సమాజం ఎప్పటికీ బాగుపడదని స్పష్టం చేశారు. కొటేషన్ల పేరుతో అవినీతి కార్యకలాపాలు ప్రారంభమై తర్వాత దశలవారీగా మంజూరు చేసిన సొమ్ము అంతా పంచుకునే పరిస్థితి ఉండుబోదని చెప్పారు. ఖచ్చితంగా యూనిట్‌ ఎక్కడస్థాపిస్తున్నారో ఆ ప్రాంతం

నుండి లబ్ధిదారునితో కలిసి బ్యాంకు ప్రతినిధి, సంబంధిత మండలాధికారి కలిసి సెల్ఫీ ఫొటో దిగాలని దాన్ని జియోటాగింగ్‌ చేసి లబ్ధిదారుడు పదిసార్లు బ్యాంకుల చుట్టూ తిరగకుండా కొటేషన్ల కోసం పరుగులు పెట్టకుండా ఆ నిబంధనలను సులభతరం చేసామని అన్నారు. లబ్ధిదారుడి చెంతకే అవసరమైన సొమ్ము అందించేలా నూతన పట్టిష్టవిధానాన్ని అమలు చేయాలని బ్యాంకర్లను, వివిధ శాఖల అధికారులను గతంలోనే కలెక్టర్‌ ఆదేశించారు.