సమస్యలపై కౌలు రైతుల పాదయాత్ర

22 రోజులపాటు కొనసాగుతుందని వెల్లడి
కాకినాడ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కౌలు రైతుల రక్షణ సంక్షేమం పేరిట ఎపి కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కాజులూరు మండలం గొల్లపాలెంలో  పాదయాత్ర చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు , రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి కెవి.రామకృష్ణలు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. 22 రోజుల పాటు 500 కిలోవిూటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నట్లు కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూటికి 80 నుంచి 90 శాతం కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. పేద, మధ్య తరగతి వారే కౌలుకు వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు పంట రుణాలు, రూ.25 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇస్తుందన్నారు. పంటరుణాలు భూ యజమానులకు ఇవ్వడంతో సాగుచేస్తున్న కౌలుదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ అయిపోతుంది కాబట్టి రబీ పంటకైనా కౌలు రైతులకు రుణాలివ్వాలని, 2011 అధీకఅత సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కౌలు రైతుల సంక్షేమం, రక్షణతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర చివరి రోజున గుంటూరులో మూడు వేల మంది కౌలు రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.

తాజావార్తలు