సమాచార చౌర్యంకేసు..  తెలంగాణ పోలీసుల కుట్రలో భాగమే


– చిత్తశుద్ది ఉంటే కేసును ఏపీకి బదలాయించండి
– తెదేపా ఎంపీ కనకమేడల
అమరావతి, మార్చి5(జ‌నంసాక్షి) : సమాచార చౌర్యం కేసు తెలంగాణ పోలీసుల కుట్రలో భాగమనే అనుమానం కలుగుతోందని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును ఇప్పటికైనా ఏపీకి బదలాయించాలన్నారు. మరో రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో తెలంగాణ పోలీసుల జోక్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని.. పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉంటాయని ఆయన వెల్లడించారు. భాజపా సూచించినట్లుగానే తెరాస, వైకాపా పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబును ఓడించాలని పెద్ద కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ డేటా చోరీకి గురైతే ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలి కదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని విస్మరించి తెలంగాణ పోలీసులే విచారణ చేయడమేంటని ఆయన మండిపడ్డారు. సజ్జనార్‌ ఓ రాజకీయ నేతలా నిన్న విూడియా సమావేశంలో మాట్లాడారని కనకమేడల ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ప్రభుత్వం డేటాను చోరీ చేసి వైసీపీకి అందించారని విమర్శించారు. దీంతో వైసీపీ ఆ డేటా ఆధారంగా తెదేపా కార్యకర్తలకు ఫోన్‌లు చేసి తమవైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని గెలిపించేందుకు అటు ఢిల్లీ కేంద్రంగా బీజేపీ, ఇటు హైదరాబాద్‌ కేంద్రంగా తెరాసాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. జగన్‌కు నేరుగా టీడీపీని ఎదుర్కొనే దమ్ములేకనే రాబోయే ఎన్నికల్లో తన గెలుపు బాధ్యతలను భాజపా, కేసీఆర్‌కు అప్పగించి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడుతున్నారని అన్నారు. ఫలితంగా ఏపీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు జగన్‌ను అడ్డుపెట్టుకొని వారు కుట్రలు చేస్తున్నారని కనకమేడల విమర్శించారు. వీరి కుట్రలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని గుణపాఠం తప్పదని హెచ్చరించారు.