సమైక్యరాష్ట్రంలో కూడా ఇలాంటి కష్టాలు లేవు
తోణం ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలి: సిఐటియూసి
ఆదిలాబాద్,నవంబర్21 (జనం సాక్షి) : సమైక్య రాష్ట్రంలో ఏనాడు వేతన బాధలు పడని చిరుద్యోగులు, కార్మికులు స్వరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం దుర్భర పరిస్థితులు ఎదురుచూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా నేతలుఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు సమమె విరమణ ప్రతిపాదనలపై సర్కార్ తక్షణం స్పందించి, కార్మికులకు న్యాయం చేయాలన్నారు. పండగల పేర్లతో కోట్లాది రుపాయాలను తెరాస ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. చెమటోడ్చే కార్మికులు, కర్షకులకు వేతనాల చెల్లింపు, దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పరిష్కరించడంలేదని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు పనిచేసిన నెలకు జీతాలు చెల్లించి ఆదుకోవాలన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? కార్మికులు కన్నీళ్లు పెట్టుకోవడమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు ఎండుగడుతామన్నారు. కార్మికులు, కర్షకులు, చిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలను మాత్రం పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు. ఇక పంచాయితీలను బలోపేతం చేస్తామని చెప్పి వాటిని నీరసించేలా చేశారని అన్నారు. పంచాయతీలు నిధులు లేక నిర్వీర్యమవుతున్నాయని, వాటి బలోపేతానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మేజర్ పంచాయతీలకు 15లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ.10లక్షల ప్రోత్సాహం అందిస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా అందలేదన్నారు. కేంద్రం ఇచ్చే 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచే విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ ఉన్న కొద్ది నిధులను సైతం ప్రభుత్వమే లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.



