సరైన వ్యక్తులకే టికెట్లు

– పార్టీనే సుప్రీం అని గుర్తుంచుకోవాలి
– పార్టీకోసం పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా చూస్తా
– ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
– ఢిల్లీలో ఉదయం 8గంటల నుంచి రాత్రి 8వరకు దీక్ష
– దీక్షకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలి
– ఒకవేళ వారు రాకపోతే ప్రజలే నిర్ణయిస్తారు
– మోదీ గాయంపై కారం చల్లుతున్నాడు
– రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారు
– టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని, సరైన వ్యక్తులకే టికెట్లు ఇస్తానని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ నేతలతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడారు. కొందరికి ఇబ్బంది ఉంటే ఉండవచ్చుని, పార్టీనే సుప్రీం అని గుర్తుంచుకోవాలని నిర్దేశించారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఇబ్బంది లేకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ ద్వారానే ¬దా వచ్చిందని మంత్రులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉదయం 8గంటల నుంచి రాత్రి 8వరకు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్షకు అందరినీ తీసుకెళ్లే బాధ్యత ముగ్గురు మంత్రుల కమిటీదే అని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని దీక్షను విజయవంతం చేయాలని మంత్రి కాల్వను సీఎం ఆదేశించారు. దీక్షకు ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలన్నారు. ఒక వేళ ప్రతిపక్షాలు రాకపోతే ప్రజలే నిర్ణయిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. బందరు పోర్టు పనులకు శంకుస్థాపన ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. దశాబ్దాల కలను నిజం చేస్తున్నామన్నారు. కౌన్సిల్‌ చైర్మన్‌గా షరీఫ్‌ బాధ్యతలు చారిత్రక ఘట్టమని బాబు అన్నారు. బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ చేశామని, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌ చేశామని గుర్తు చేశారు. సామాజిక న్యాయమే టీడీపీ మూల సూత్రమని వెల్లడించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.250 కోట్లు ఇస్తున్నామన్నారు. కులాల పేరుతో ప్రతిపక్షం విడదీసే కుట్రలు చేస్తోందని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్రం విషయంలో మోదీ చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, ఏపీకి జరిగిన విభజన గాయాన్ని పెద్దది చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్‌ని మోదీ అంధకారం చేశారని విమర్శించారు. లోక్‌సభలో మోదీ ప్రసంగం గాయం విూద కారం చల్లినట్లుందని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో గల్లా జయదేవ్‌ ప్రసంగానికి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. టీడీపీ ఎంపీల స్పూర్తి అందరిలో రావాలని నేతలకు సూచించారు. తెలంగాణలో ఏవిూ చేయని కేసీఆర్‌కు 80 సీట్లు వస్తే తమకెన్ని ఎన్ని సీట్లు రావాలన్నారు. కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామన్న మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. జగన్‌, కేసీఆర్‌, మోదీ కుమ్మక్కయ్యారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. మనం శాశ్వతంగా అధికారంలో ఉంటూనే ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని.. అయినా అంతా పార్టీకి విశ్వాసం గా ఉండాలన్నారు. అందరికీ న్యాయం చేయగలగాలని.. చివరి కార్యకర్త వరకూ న్యాయం చేసే బాధ్యత తనదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.