సర్వేలో బయటపడుతున్న అక్రమాలు
ఆందోళనలతో వెలుగులోకి మరిన్ని బాగోతాలు
ఆదిలాబాద్,నవంబర్25 (జనంసాక్షి) : భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఈ భూములు అన్యాక్రాంతం అయినట్లుగా గుర్తించారు. అలాగే రైతుల భూములు కూడా చేతులు మారినట్లుగా గుర్తించార. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే రెవెన్యూ అధికారుల అక్రమాలు బయటపడుతున్నాయి. వివరాల ఆధారంగా రెవెన్యూ బృందాలు ఈ భూముల వివరాలను సేకరిస్తున్నాయని ఆదిలాబాద్ రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఎంత భూమి అందుబాటులో ఉంది, ఇతరుల ఆధీనంలోకి వెల్లిందా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. కబ్జాకు గురైనా, ఎవరైనా విక్రయించినా వాటి వివరాలను సైతం తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకవేళ అసైన్డ్ భూములను ఇతరులకు విక్రయించినట్లు పట్టా ఇచ్చినా చెల్లుబాటు కాదన్నారు. రెవెన్యూ బృందాలు గ్రామాల్లోని అసైన్డ్ భూముల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఇటీవలి సర్వేలో వందల ఎకరాల భూమి ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. కొందరు రెవెన్యూ సిబ్బంది నుంచి ఎన్‌వోసీలు తీసుకుని ఇతరులకు కట్టబెట్టారు. మరికొన్ని గ్రామాల్లో అసైన్డ్ భూముల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్లో మరికొందరు పంటలు సాగుచేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా అసైన్డ్ భూములను నిజమైన లబ్ధిదారులు సాగుచేస్తుంటే ఆ వివరాలను రెవెన్యూ రికార్డుల్లో వారి వివరాలను క్షణ్ణంగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు 340 సర్వే నంబర్లలోని దాదాపు వందలఎకరాల అసైన్డ్ భూములు ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న అధికారులు భూములను ఎవరికి పంపిణీ చేశారు. వారు విక్రయించారా లేక కబ్జాకు గురయ్యాయా, ఏ స్థితిలో ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. భూమిలేని దళితకుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం లక్ష ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములను కొందరు లబ్ధిదారులు విక్రయించగా మరికొన్ని కబ్జాకు గురైనట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ భూముల్లో అసలైన లబ్ధిదారులకు బదులు ఇతరులు పంటలు సాగుచేసినా, కబ్జాలో ఉన్నా వారి పేర్లు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వివరాలను రాసుకుంటున్నారు. జిల్లాలోని చాల ప్రాంతాల్లో అసైన్డ్ భూములు అన్యాకృతమై పట్టణాలు, గ్రామాల్లో కలిసిపోయి కనిపించకుండా పోయాయి.